Telugu Global
Editor's Choice

చేసింది పిసరంతా.. చెప్పుకునేది దేశమంతా!

ఆరింటిలో ఒక్క గ్యారెంటీ అమలు చేయలే.. 420 హామీల అమలు ముచ్చటే ఎత్తని రేవంత్

చేసింది పిసరంతా.. చెప్పుకునేది దేశమంతా!
X

వినేవాడు ఉంటే చంద్రబాబు ఏమైనా చెప్తాడు అంటారు. ఇప్పుడు రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా సెల్ఫ్‌ డబ్బాలో ఆయన సహచరుడిని మించిపోయారు. ఇప్పటికే కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని తన వ్యక్తిగత ప్రచారానికి వృథా చేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్న ఆయన తన పాలనపై సమీక్ష చేసుకోకుండా ఇంకా అవే అబద్ధాలు ప్రచారం చేసుకోవాలని డిసైడ్‌ అయ్యారు. అందుకే రుణమాఫీ, నియామకాలు, ఉచిత విద్యుత్‌, మహాలక్ష్మీ పథకం కింద ఇచ్చే ఉచిత గ్యాస్‌, ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌, గ్రూప్స్‌ పరీక్షల గురించి నిత్యం అసత్యాలు ప్రచారం చేయడమే కాకుండా ఈమధ్య ఏ వేదికపైనా మూసీ గురించి పదే పదే కలవరిస్తున్నారు. సీఎం తమ ప్రభుత్వం 11 నెలల్లో సాధించిన విజయాలు అని ప్రచారం చేసుకునే వాటి అమలు కోసమే విపక్షాలు, ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. వాటిపై సమాధానాలు ఇవ్వరు. ఆందోళనలపై స్పందించరు. కానీ తాము చెప్పాలనుకునే విషయాన్నే పదే పదే పత్రికల్లో, ప్రచారం హోర్డింగ్స్‌లో, ఉపన్యాసాల్లో అవే ఉండేలా జాగ్రత్తలు మాత్రం తీసుకుంటున్నారు. అందుకే ఎనుముల రేవంత్‌ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్‌రెడ్డి అని విపక్ష నేత హరీశ్‌రావు ఈ మధ్యకాలంలో విమర్శించారు.

తాజాగా రాష్ట్రంలో రేవంత్‌ పాలనపై ప్రధాని మోడీ విమర్శలు చేస్తే అదేదో తనకు సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు తమ ప్రభుత్వ తప్పిదాలను ప్రధాని మోడీ వివరిస్తున్నందుకు సంతోషంగా ఉన్నదంటూనే ఎక్స్‌ వేదికగా 11 నెలలుగా ప్రచారం చేసుకుంటున్నవాటినే ఎక్స్‌ వేదికగా మరోసారి చెప్పుకొచ్చారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానంపై పవిత్రమైన నిబద్ధతతో ఉన్నామన్నారు. ఈ విషయాన్ని ప్రజల వద్దకు వెళ్తే అవి నిజమో? అబద్ధమో ముఖ్యమంత్రి ముందే ప్రజలు తేల్చేస్తారు కదా! 22 లక్షల మంది రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని రైతుల వద్దకు వెళ్తే వాళ్లు ఏం చెప్తారో కూడా ముఖ్యమంత్రి వినవచ్చు. 11 నెలల్లోనే 50 వేలకుపైగా ఉద్యోగ నియామకాలు చేపట్టామంటున్న సీఎం ఇదే విషయాన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సవాల్‌ చేసినట్లు ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో రాహుల్‌గాంధీని వెంట బెట్టుకుని నిరుద్యోగులనే అడిగితే నియామకాల భర్తీ నిజమో? పచ్చి అబద్ధమో? రాహుల్‌ గాంధీకి అర్థమయ్యేలా అంకెలతో సహా నిరుద్యోగులే చెప్తారు.

ఇక పద కొండు నెలల్లోనే అన్నీ చేశామని ఇక దేశానికే దిక్సూచీ నిలిచేలా కులగణన చేస్తామంటున్న రేవంత్‌ సర్కార్‌కు ప్రజలు కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. పదకొండు నెలల కిందట రేవంత్‌ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో 1.05 కోట్ల అప్లికేషన్‌ పత్రాలు స్వీకరించింది. అందులోనూ కులం వివరాలున్నాయి. ఇప్పటిదాకా ఆ అప్లికేషన్లు ఏమయ్యాయో? ఎవరికీ తెలియదు. అంతేకాదు ఆ స్వీకరించిన పత్రాల డేటా ఎంట్రీ జరగుతున్నదని ప్రకటించిన ప్రభుత్వం తర్వాత దాని గురించి మాట్లాడటం మానేసింది. ఆ పత్రాలు ఎక్కడా పబ్లిక్‌ డొమైన్‌లోనూ కనిపించడం లేదు. ఎక్కడైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్లను అడిగితే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు తప్పా వాటి గురించి మాత్రం జవాబు ఇవ్వడం లేదు. 11 నెలల్లో నెలకో కొత్త నాటకాన్ని రక్తికట్టిస్తూ రేవంత్‌ ప్రభుత్వం చేస్తున్న డైవర్షన్‌ పాలిటిక్స్‌ పై ప్రజలకు అర్థమైంది. ఎనుముల రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పథకాల్లో కోతలు పెడుతున్నదే తప్పా కొత్తగా ఇచ్చింది లేదు, ఆరు గ్యారెంటీలను అమలు చేసిందీ లేదంటున్నారు. సీఎం చేసేవన్నీ స్టంట్సేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  2 Nov 2024 1:39 PM IST
Next Story