Telugu Global
Editor's Choice

అక్రమ కేసులు.. అరెస్టులు.. భౌతికదాడులు

తొమ్మిది నెలల ప్రజాపాలనలో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ ఇచ్చిన గ్యారెంటీలివే

అక్రమ కేసులు.. అరెస్టులు.. భౌతికదాడులు
X

గత ప్రభుత్వంలో నిర్బంధాలు, అణిచివేతలు అని కొంతమంది గగ్గోలు పెట్టారు. ఉన్నవి లేనివి కట్టుకథలు ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పదేళ్ల తర్వాత స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు వచ్చాయని కొనియాడిన వారున్నారు. ఎవరి అభిప్రాయాలు వారివి. అయితే తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి, ప్రశ్నించిన వారిపై దాడుల గురించి, అక్రమ అరెస్టుల గురించి గత ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్లు మౌనంగా ఉండటం శోచనీయం.

భారీ వర్షాలు, వరదల ఉధృతికి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు మూడు నాలుగు రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంటే ఆ జిల్లా తరఫున ముగ్గురు మంత్రులున్నా బాధితులను ఆదుకోలేకపోయారు. ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించలేకపోయారు. ఒక మంత్రి అయితే హెలీకాప్టర్‌ తెప్పించలేకపోయినందుకు మొసలి కన్నీరు పెట్టుకున్నారు. మరో మంత్రి దేవునిపై భారం వేశారు. డిప్యూటీ సీఎం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అన్నట్టు ఉన్నది ఆయన వ్యవహారం. ప్రధాన ప్రతిపక్షం తన బాధ్యతగా బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పి, వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తే మాజీ మంత్రుల కాన్వాయ్‌పై దాడులు చేశారు. సురేందర్‌రెడ్డి అనే బీఆర్‌ఎస్‌ కార్యకర్తపై దారుణంగా దాడి చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నించడం, ప్రజల కష్టాల గురించి తెలుసుకోవడం, ప్రభుత్వాన్ని విమర్శించడం నిషేధించబడినాయి అన్నట్టు రాష్ట్రంలో రేవంత్‌ ప్రభుత్వ పాలన ఉన్నది.

శాంతిభద్రతలు కాపాడాల్సిన ముఖ్యమంత్రే విపక్ష నేతల ఇండ్లపైకి మావాళ్లే వెళ్లి దాడి చేశారని, వీపు చింతపండు చేశారని వ్యాఖ్యానించడం దురదృష్టకరం. ఉద్యమకాలం నాటి ఉద్వేగాల నేపథ్యంలో ఇక్కడ ఉండే ఇతర రాష్ట్రాల ప్రజలు, ముఖ్యంగా ఏపీ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అనే సందేహాలు, ఆందోళన కొంతమంది వ్యక్తం చేశారు. అయితే పొట్గగూటి కోసం వచ్చిన వారితో మాకు ఏ పంచాయితీ లేదన్న కేసీఆర్‌ వారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటామని భరోసా ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల కాలంలో హైదరాబాద్‌లో ఎలాంటి గొడవలు, మత కలహాలు, దాడులకు ఆస్కారం కల్పించలేదు. అందుకే విభజనను వ్యతిరేకించిన వాళ్లు కూడా బీఆర్ఎస్‌ పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారు. కానీ తొమ్మిది నెలల కాలంలోనే ఉమ్మడి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను రేవంత్‌ ప్రభుత్వం పునరావృతం చేస్తున్నది. శాంతిభద్రతలు కాపాడాల్సిన ప్రభుత్వమే ఆగ్నికి ఆజ్యం పోసేలా వ్యవహరిస్తున్నది. విపక్ష నేతలే టార్గెట్‌గా భౌతిక దాడులను ప్రోత్సహిస్తున్నది. దీనిపై తెలంగాణ పౌర సమాజం నుంచి ఆందోళన వ్యక్తమౌతున్నది. మార్పు తెస్తామన్న కాంగ్రెస్‌ పాలనలో భద్రతే కరువైన పరిస్థితులు మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమౌతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ప్రతిఘాత రాజకీయాలకు పక్కనపెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి సారించాలని ప్రజాస్వామికవాదులు కోరుతున్నారు.

First Published:  20 Sept 2024 4:08 PM GMT
Next Story