గద్దర్.. ఆ పేరే ఉద్యమ గర్జన!
తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్ పాత్ర ఏమిటో తెలియదు. కానీ ఉద్యమంలో గద్దర్ అంటేనే ఆయన పాట, ఆట గుర్తుకు వస్తాయి.
తెలంగాణ ఉద్యమం ఆర్ఎస్యూ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు అందరినీ ఏకం చేసింది. రాష్ట్ర సాధన ఉద్యమం కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో, గాంధేయ మార్గంలో నడిచింది.అహింసా పద్ధతుల ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. సుదీర్ఘకాలం జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది గద్దర్. ఆయన విప్లవోద్యమంలో పనిచేసినా పీడిత ప్రజల కోసమే కొట్లాడారు. హక్కుల కోసం కొట్లాడిన ఆయనకు నాటి ప్రభుత్వాలు ఇచ్చిన బహుమతి బుల్లెట్లు. ఆయనను హత్య చేయాలని నాటి టీడీపీ ప్రభుత్వం చూసిందనే ఆరోపణలు ఉన్నాయి. అంతెందుకు వామపక్షపార్టీలో పనిచేసిన ఈటల రాజేందర్ ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఆయన ఆపార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. గద్దర్‌కు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకోలేదా? లేక కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పిన కారణాలతోనే పక్కనపెట్టిందా? అన్నది కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రజల కోసం కొట్లాడే వాళ్లు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. గద్దర్ విప్లవోద్యమంలో పనిచేశారు కాబట్టే ఆయనకు పద్మశ్రీ ఇవ్వలేదని బండి సంజయ్ బహిరంగంగా చెప్పడం గర్హనీయం.
ఆయన కేంద్ర మంత్రిగా కాకుండా ఒక గల్లీ లీడర్లా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదు. సంజయ్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా? లేక ఆ పార్టీ విధానమా తెలియాల్సి ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్ పాత్ర ఏమిటో తెలియదు. కానీ ఉద్యమంలో గద్దర్ అంటేనే ఆయన పాట, ఆట గుర్తుకు వస్తాయి. భారత ప్రభుత్వం ఇచ్చే అత్యుత్తమ అవార్డులపై ఏకాభిప్రాయం ఎన్నడూ లేదు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన వారందరికీ కేంద్ర పురస్కారాలు ఇవ్వరు. పద్మశ్రీ వచ్చే స్థాయి ఉన్న వారి పేర్లనే సిఫారసు చేయాలి. గద్దర్ మావోయిస్టు భావజాలమని సంజయ్ అన్నారు. మనది సమాఖ్య ప్రభుత్వం కదా. రాజ్యాంగంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు పంపే పేర్లను పరిగణనలోకి తీసుకోము అంటే మనది అధ్యక్ష తరహా పాలన కాదు కదా? సంజయ్ చెప్పిన దానికి ప్రకారం బీజేపీ యేతర ప్రభుత్వాలు పంపే ఏ సిఫార్సులను పట్టించుకోము అన్నట్లే ఉన్నది. ఎందుకంటే ఆయన చెప్పిన దాని ప్రకారమే మావోయిస్టు భావజాలం అంటే వాళ్ల పార్టీలోనే ఉన్న ఈటల రాజేందర్, పద్మ అవార్డుకు ఎంపికైన మందకృష్ణది ఏ భావజాలమో చెబితే బాగుటుంది.
ఈటల రాజేందర్‌ను అయినా, మంద కృష్ణను అయినా తెలంగాణ సమాజం ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన వారినే గుర్తిస్తుంది. వాళ్లు పీడిత ప్రజల పక్షాన నిలబడిన వారుగా. ఉద్యమాలు చేసిన వారిగానే చూస్తుంది. బీజేపీ యేతర ప్రభుత్వాలు పంపే సిఫార్సులు పరిగణనలోకి తీసుకోమని భావిస్తే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తిగా ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పడం క్షమించరానిది. గద్దర్‌కు అవార్డులు, పురస్కారాలే కొలమానం కాదు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.
కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయ విభేదాలు, సిద్ధాంత వైరుధ్యాలకు ప్రజాయుద్ధనౌక గద్దర్‌ను వాడుకోవడం తెలంగాణ సమాజం ఎన్నడూ అంగీకరించదు. బండి సంజయ్ వ్యాఖ్యలు చూసిన తర్వాత భవిష్యత్తులో తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఎలా వ్యవహరిస్తామో చెప్పకనే చెప్పారు. కాబట్టి తెలంగాణ ప్రజలరా బహుపరాక్!