కాళేశ్వరం ప్రాజెక్టుకు కాళ్లల్లో కట్టెలు పెట్టిందే చంద్రబాబు
అడుగడుగునా అడ్డంకులు.. కేంద్రానికి ఫిర్యాదులు

''తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే తాము అడ్డుకున్నామా..? వృథాగా సముద్రంలోకి వెళ్లే నీటితో బనకచర్ల ప్రాజెక్టు చేపడితే తప్పేంటి..? తెలంగాణ మరిన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా వద్దనం.. వాళ్లు ఉపయోగించుకోగా కిందికి నీళ్లొస్తేనే మా ప్రాజెక్టుల ద్వారా వాడుకుంటాం..'' ఇవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు. రాష్ట్ర విభజనకు ముందే రెండు కళ్ల సిద్ధాంతంతో ఫేమస్ అయిన చంద్రబాబు.. రాష్ట్ర విభజన తర్వాత సైతం తెలంగాణపై అక్కసు వెళ్లగక్కడం ఆపలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తలపెట్టిన ప్రాణహిత - చేవెళ్ల ఎత్తిపోతల పథకాన్నే తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా రీ డిజైన్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు హైడ్రాలజీ, ఎన్విరాన్‌మెంట్ క్లియరెన్స్ లు సహా అన్ని అనుమతులను సీడబ్ల్యూసీ ఇచ్చింది. ప్రాంతాల వారీగా బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ చేసిన నీటి కేటాయింపులకు లోబడి కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. నీటి కేటాయింపులకు లోబడి కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. కాళ్లల్లో కట్టెలు పెట్టారు. ఇప్పుడేమో తాము కాళేశ్వరాన్ని అడ్డుకున్నామా అని అమాయకంగా మాట్లాడుతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఐదుసార్లు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. 2018 జూన్ 13న అప్పటి ఇరిగేషన్ శాఖ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ కేంద్ర జలశక్తి శాఖ సెక్రటరీకి కాళేశ్వరంపై ఫిర్యాదు చేశారు. ఏకంగా తొమ్మిది పేజీల సుదీర్ఘ లేఖ రాసి కాళేశ్వరం ప్రాజెక్టుకు తుది అనుమతులు ఇవ్వొద్దని కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తోందని ఆక్షేపించారు. 2016 జనవరి 20న కాళేశ్వరం ప్రాజెక్టుపై జీఆర్‌ఎంబీ మెంబర్ సెక్రటరీకి ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. అదే ఏడాది మే 5న కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి మరోసారి ఫిర్యాదు చేసింది. 2017 మార్చి 19న కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి, అదే ఏడాది జూన్ 25న మళ్లీ కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ ఐదు పర్యాయాలు కూడా చంద్రబాబు నాయుడు అనుమతితోనే ఆ రాష్ట్ర వాటర్ రీసోర్సెస్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. 2018, 2019లో జరిగిన గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టే అక్రమమని ఏపీ ప్రభుత్వం అడ్డగోలుగా వాదించింది. ప్రతి సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునే కుట్రలు చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టు నికర జలాలపై నిర్మిస్తోన్న ప్రాజెక్టు. గోదావరిలో తెలంగాణ ప్రాంతానికి హక్కుగా దక్కే 954 టీఎంసీలకు లోబడి నిర్మించిన ప్రాజెక్టు. గోదావరిలో విభజిత ఆంధ్రప్రదేశ్ కు హక్కుగా దక్కేది 526 టీఎంసీలు. దవళేశ్వరం బ్యారేజీ ద్వారా ఇప్పటికే ఏపీ గోదావరి అత్యధిక నీటిని వినియోగించుకుంటోంది. పోలవరం ప్రాజెక్టు డెడికేటెడ్ ఆయకట్టుకు తోడు గోదావరి - బనకచర్ల లింక్ ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుల ద్వారా 450 టీఎంసీలకు పైగా నీటి వినియోగానికి ప్లాన్ చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు నీటి హక్కులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టు విషయంలో తెలంగాణకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. పోలవరం కుడి కాలువ ద్వారా బనకచర్ల లింక్, ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుల పేరుతో భారీ ఎత్తున నీటిని తరలించే ప్రయత్నాలపైనే తెలంగాణ అభ్యంతరాలు చెప్తోంది. ఇవి పూర్తిగా మిగులు జలాల ఆధారంగా చేపట్టే ప్రాజెక్టులు. గోదావరిలో రాష్ట్రాల వారీగా నీటి వాటాలు తేలలేదు. ఉమ్మడి ఏపీకి చేసిన నీటి కేటాయింపులు 1,480 టీఎంసీలు.. ఇందులో తెలంగాణ ప్రాంతానికి 954 టీఎంసీలు హక్కుగా దక్కుతాయని రాష్ట్ర విభజనకు ముందు అప్పటి ఏపీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన ప్రజంటేషన్ లో వెళ్లడించారు.
తెలంగాణ రాష్ట్రం తమకు హక్కుగా దక్కే 954 టీఎంసీలను వినియోగించుకునేలా ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ఎక్కడా మిగులు జలాల అంశం లేదు. ఏపీ సముద్రంలోకి పోయే వృథా జలాల పేరుతో భారీ లింక్ ప్రాజెక్టును తలపెట్టింది. బనకచర్ల లింక్ ద్వారా కృష్ణా, పెన్నా బేసిన్‌లకు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా వంశధార బేసిన్ కు నీటి కరువు రాకుండా చూసుకోవాలన్నదే ఏపీ పాలకుల లక్ష్యంగా కనిపిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నా.. జగన్ ఉన్నా ఈ ప్రాజెక్టులపై వెనక్కి తగ్గలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుతో బనకచర్లను పోల్చుకొని అక్రమ ప్రాజెక్టును సక్రమం చేసుకోవాలన్న ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. గోదావరి నీటి పంపకాలపై ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేసి రాష్ట్రాల వారీగా నీటి పంపకాలు చేసిన తర్వాత మిగులు జలాల ఆధారంగా ఏపీ ప్రభుత్వం చేపడితే తెలంగాణకు ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. నీటి వాటాలే తేలకుండా వృథా జలాల పేరుతో ప్రాజెక్టును నిర్మించి దానికి నీటి భద్రత పొందడం ద్వారా తెలంగాణ నీటి హక్కులు కాలరాయాలనే ప్రయత్నాలనే తెలంగాణ వ్యతిరేకిస్తోంది. నెర్రెలు బారిన నేలను సస్యశ్యామలం చేసేవి తెలంగాణ ప్రాజెక్టులైతే.. ఇప్పటికే వివిధ ప్రాజెక్టుల కింద నీళ్లందుతున్న ఆయకట్టుకు అదనపు నీటిని ఇచ్చేందుకు ఏపీ కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తోంది. కృష్ణా, పెన్నా, వంశధార బేసిన్‌లలో ఒక ఏడాది వర్షాలు కురవకున్నా వాటిపై ఉన్న ప్రాజెక్టుల ఆయకట్టుకు గోదావరి నీళ్లు ఇచ్చేందుకు ఏపీ ప్రాజెక్టులు నిర్మిస్తోంది. తెలంగాణకు హక్కుగా దక్కే నీటికే దిక్కులేదు.. ఏపీ అదనంగా నీళ్లు తీసుకునేందుకు ప్రాజెక్టులు నిర్మిస్తోంది.. అదీ తెలంగాణ ప్రాజెక్టులకు అడుగడుగునా అడ్డు తగులుతూ.. అందుకే ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ అభ్యంతరాలు చెప్తోంది.