చంద్రబాబు.. మైనారిటీల పాలిటి మాయల మరాఠీ!
దేశవ్యాప్తంగా హిందూత్వ ఎజెండాతో మైనారిటీల మీద దాడులకు తెగబడ్డ బిజెపితో పొత్తుకు చంద్రబాబు, పవన్‌లు తెరదీసినపుడే వారి ముస్లిం వ్యతిరేక వైఖరి తేటతెల్లమైందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
హిందూత్వ ఎజెండాతో మతరాజకీయాలు చేసే బిజెపితో అంటకాగిన టిడిపి అధినేత చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో మైనారిటీలు తగిన గుణపాఠం చెప్పబోతున్నారు. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన బాబు తప్పుడు వాగ్దానాలతో మరోసారి ముస్లిం మైనారిటీలను మోసపుచ్చే విధానానికి తెరదీశారని పరిశీలకులు అంటున్నారు.
ఏ ఎండకు ఆ గొడుగు పట్టే చంద్రబాబు దేశ రాజకీయాల్లోనూ, రాష్ట్ర రాజకీయాల్లోనూ మైనారిటీ వ్యతిరేక వైఖరిని అనుసరించిన సందర్భాలు అనేకం. లౌకికవాదం కన్నా అవకాశవాదమే ఆయన రాజకీయ పంథా. బిజెపితో పొత్తు వల్ల మైనారిటీలు దూరమవుతారనే భయంతో మైనారిటీల మీద హామీల వర్షం కురిపిస్తున్నది బాబు పరివారం. కనుకనే ఈసారి అధికారంలోకి వస్తే ముస్లింలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు చెబుతున్నారు. కానీ 2014లో అధికారంలోకి వచ్చినపుడే ఆ పని ఎందుకు చేయలేదని ముస్లిం మైనారిటీలు ప్రశ్నిస్తున్నారు. అలాగే తాను అధికారంలోకి వస్తే ఇమామ్‌లకు నెలకు 10,000 రూపాయలు ఇస్తానని చేస్తున్న వాగ్దానాన్ని ఎలా నమ్మాలని ముస్లిం పెద్దలు అంటున్నారు.
అయిదేళ్ళ కిందట చంద్రబాబు హయాంలో ఇమామ్‌లకు చంద్రబాబు మూడు వేల రూపాయలు అందిస్తే, జగన్ దానిని అయిదు వేల రూపాయలకు పెంచారు. ఆనాడు జగన్‌కు సాధ్యమైన పని చంద్రబాబుకు ఎందుకు సాధ్యం కాలేదన్నదే అసలు ప్రశ్న. నాడు 5000 రూపాయలు ఇవ్వలేని ఈ పెద్ద మనిషి ఇపుడు ఏకంగా 10000 ఇస్తామని ఎన్నికల ముందు చెబుతున్న మాట నీటి మూటేనని అంటున్నారు. తప్పుడు హామీలతో మైనారిటీల ఓట్లను కొల్లగొట్టాలని చూస్తున్న చంద్రబాబు మాటల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముస్లిం పెద్దలు కోరుతున్నారు.
దేశవ్యాప్తంగా హిందూత్వ ఎజెండాతో మైనారిటీల మీద దాడులకు తెగబడ్డ బిజెపితో పొత్తుకు చంద్రబాబు, పవన్‌లు తెరదీసినపుడే వారి ముస్లిం వ్యతిరేక వైఖరి తేటతెల్లమైందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. గత ఎన్నికల్లో ఏపిలో 1 శాతం ఓట్లు కూడా పొందని బిజెపితో బాబు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? తమ స్వార్థం కోసం, అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు చంద్రబాబు బిజెపితో జత కట్టారని విద్యావంతులైన ముస్లింలు భావిస్తున్నారు.
అనేక రాష్ట్రాలలో ముస్లిం మైనారిటీల మీద కాషాయ మూకలు దాడులు చేసిన సందర్భాల్లోనూ చంద్రబాబు మౌనం వహించారు. హిజాబ్ వివాదాన్ని రెచ్చగొట్టి సమాజంలో విభజనను, విద్వేషాన్ని రగుల్కొల్సిన బిజెపిని, ఇతర సంఘ్ పరివార్ విధానాలను బాబు ఎన్నడూ నిరసించలేదు. ఇపుడు ముస్లిం మైనారిటీల పట్ల వివక్షతో కూడిన సిఏఏ అమలును కూడా బాబు వ్యతిరేకించడం లేదు.
కాశ్మీర్ వివాదంలో, ఆర్టికల్ 370 రద్దు అంశంలో చంద్రబాబు నాయుడు బిజెపికి అనుకూలమైన వైఖరి తీసుకున్నారు. జాతీయ రాజకీయాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడయిన ఫరూక్ అబ్దుల్లాతో సత్సంబంధాలు నెలకొల్పుకొని ఒక దశలో ఆయన మద్దతు పొందారు. కానీ ఫరూక్ అబ్దుల్లా, ఆయన తనయుడు ఒమర్ అబ్దుల్లాను బిజెపి ప్రభుత్వం నిర్బంధానికి గురి చేసినపుడు చంద్రబాబు నోరు మెదపలేదు. వారి అక్రమ అరెస్టులను ఖండించలేదు. మైనారిటీలపై విద్వేషపూరిత దాడులను సాగిస్తున్న కాషాయ దుర్మార్గాన్ని గత అయిదేళ్ళ కాలంలో చంద్రబాబు నాయుడు ఏనాడూ ఖండించిన సందర్భాలు లేవు. ఈరకంగా ముస్లింలపై వివక్షను చంద్రబాబు తన మౌనంతో సమర్థించారు.
ఇవాళ ముస్లింల సంక్షేమం కోసం తాను ఉన్నానని చంద్రబాబు ఎన్ని మాయమాటలు చెప్పినా నమ్మే స్థితి లేదు. ముస్లిం ఆడపిల్లల పెళ్ళిళ్ళకు తాను భరోసా ఇస్తానని బాబు చెబుతున్నారు, కానీ తాము అధికారంలో ఉన్నపుడు ముస్లిం మహిళల ఉన్నతికి ఆయన చేసిందేమి లేదు. పదవిలో ఉన్నపుడు ఓ రకంగా, లేనపుడు మరోరకంగా వ్యవహరించే చంద్రబాబు అసలు స్వరూపాన్ని జనాలు ఇట్టే గ్రహిస్తున్నారు.
ఇప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో మైనారిటీలకు వైసిపి ఏడు సీట్లు కేటాయిస్తే బాబు`పవన్ కూటమి కేవలం మూడు సీట్లు మాత్రమే ఇచ్చింది. ఇక్కడే చంద్రబాబు మోసకారితనం తెలిసిపోతున్నదని పరిశీలకులు అంటున్నారు. బిజెపితో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు ముస్లింల సంక్షేమం పేరుతో తియ్యటి మాటలు చెబుతూనే చట్టసభల్లో వారి ప్రాతినిధ్యాన్ని తగ్గించే కుటిలవైఖరిని అనుసరిస్తున్నారు. కనుకనే ముస్లిం మైనారిటీల పాలిట మాయల మరాఠీగా పరిణమించిన చందబ్రాబుకు తగిన పాఠం చెప్పేందుకు మైనారిటీలు సిద్ధమవుతున్నారు. మత రాజకీయాలకు తావులేని ఏపిలో కాషాయ పాలకులతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబుకు మైనారిటీల చేతిలో శృంగభంగం తప్పేట్టు లేదని పరిశీలకులు అంటున్నారు.