వ్యూస్ పెరగట్లేదనే బాధలో యూట్యూబర్ ఆత్మహత్య
ఎంత ప్రయత్నించినా అతడి ఛానల్‌కు సబ్‌స్క్రైబర్లు పెరగడం లేదు దీంతో కలత చెంది నాలుగంతస్తుల భవనం పై నుంచి దూకి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇటీవల యువత చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. యూట్యూబర్లు, బ్లాగర్లు, వ్లాగర్లకు ప్రస్తుతం చాలా డిమాండ్ ఉన్నది. స్పోర్ట్స్, పాలిటిక్స్, టెక్నాలజీ, హెల్త్, గేమింగ్ వంటి అంశాల్లో అనేక మంది సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభించి ఇన్‌ఫ్లుయెన్సర్లుగా మారుతున్నారు. ఈ క్రమంలో ఔత్సాహికుడైన ఓ యువకుడు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. అయితే తాను ఆశించినంత వ్యూయర్‌షిప్ పెరగకపోవడంతో మదనపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.
బాజిరెడ్డి ప్రాంతంలోని ఆదర్శ్ హైట్స్‌లో నివసించే సి. ధీన ఐఐఐటీఎం గ్వాలియర్‌లో చదువుతున్నాడు. ఆన్‌లైన్ గేమ్స్ అంటే విపరీతంగా ఇష్టపడే ధీన.. తరచూ వాటిని ఆడుతుంటాడు. ఈ క్రమంలోనే అతడు ఆన్‌లైన్ గేమింగ్‌కి సంబంధించి 'SELFLO' అనే లైవ్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. అయితే ఎంత ప్రయత్నించినా అతడి ఛానల్‌కు సబ్‌స్క్రైబర్లు పెరగడం లేదు దీంతో కలత చెంది నాలుగంతస్తుల భవనం పై నుంచి దూకి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు.
అతడు సూసైడ్ చేసుకునే ముందు తన యూట్యూబ్ ఛానల్‌లో ఒక వీడియోను అప్‌లోడ్ చేశాడు. తాను ప్రారంభించిన ఛానల్ అనుకున్న మేరకు సక్సెస్ కాలేదని, తనకు తల్లిదండ్రుల నుంచి ఎలాంటి గైడెన్స్ లభించలేదని పేర్కొన్నాడు. ఈ విషయంలోనే తాను చాలా అప్‌సెట్ అయ్యానని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. కాగా, సైదాబాద్ పోలీసులు ఆత్మహత్య కేసు నమోదు చేసుకొని బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.