చేతులు కట్టేసి.. చెట్టుకు ఉరేశారు.. బెంగాల్‌లో బీజేపీ నేత హత్య
నిధిరాంపూర్ గ్రామంలో ఓ చెట్టుకు మృతదేహం వేలాడుతుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని చనిపోయిన వ్యక్తి మిశ్రాగా గుర్తించారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దారుణ హత్య జరిగింది. బీజేపీకి చెందిన ఓ నాయకుడిని కొందరు వ్యక్తులు హత్య చేసి చెట్టుకు వేలాడదీయడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. నిందితులను అరెస్టు చేయాలంటూ బీజేపీ నాయకులు నిరసనలకు దిగారు. వివరాల్లోకి వెళితే.. బంకురా జిల్లాకు చెందిన శుభదీప్ మిశ్రా బీజేపీలో ముఖ్య నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో మూడంచెల పంచాయతీ వ్యవస్థకు ఎన్నికలు జరుగగా.. ఆ ఎన్నికల్లో కూడా మిశ్రా పోటీ చేశారు. అయితే ఎన్నికలు ముగిశాక వారం రోజుల నుంచి మిశ్రా కనిపించకుండా పోయారు.
ఇదిలా ఉంటే బుధవారం నిధిరాంపూర్ గ్రామంలో ఓ చెట్టుకు మృతదేహం వేలాడుతుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని చనిపోయిన వ్యక్తి మిశ్రాగా గుర్తించారు. మిశ్రా రెండు చేతులను కట్టేసి అతడిని చెట్టుకు ఉరేసి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు.
మిశ్రా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా.. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే చందనా బౌరి అడ్డుకున్నారు. మిశ్రా మృతదేహం తీసుకువెళ్లకుండా వాహనం ముందు అడ్డంగా పడుకున్నారు. ఇదిలా ఉంటే శుభదీప్ మిశ్రా హత్యలో తృణమూల్ కాంగ్రెస్ హస్తం ఉందని ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆరోపించారు. మిశ్రాకు ప్రజల్లో ఆదరణ పెరగడం చూసి భరించలేకే టీఎంసీ గూండాలు హత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో బంకురా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వైభవ్ తివారీ పాత్రపై కూడా సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.