Telugu Global
CRIME

ప్రీతిది ఆత్మహత్యే అని నమ్ముతున్నాం.. పోలీసుల విచారణ సంతృప్తికరం : ప్రీతి తండ్రి

ప్రీతి ఆత్మహత్య చేసుకుందని తాము నమ్ముతున్నట్లు ఆమె తండ్రి నరేందర్ చెప్పారు. సీపీతో మాట్లాడిన తర్వాత ఉన్న అనుమానాలన్నీ నివృత్తి చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

ప్రీతిది ఆత్మహత్యే అని నమ్ముతున్నాం.. పోలీసుల విచారణ సంతృప్తికరం : ప్రీతి తండ్రి
X

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి మృతి చెందిన కేసులో పోలీసుల దర్యాప్తు ముగియడానికి వచ్చింది. ప్రీతి మృతికి గల కారణాలను ప్రాథమిక విచారణ, తల్లిదండ్రులు, క్లాస్‌మేట్స్ నుంచి సేకరించిన వివరాలతో పాటు ఫోరెన్సిక్ రిపోర్టుతో కూడా విశ్లేషించి.. ఒక నిర్ధారణకు వచ్చారు. ప్రీతిది ఆత్మహత్యే అని, హత్య అనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పోలీసులు నిర్ధారించారు. వరంగల్ సీపీ రంగనాథ్‌ను ప్రీతి తండ్రి నరేందర్, సోదరుడు పృథ్వీ కలిశారు.

ప్రీతి మృతికి గల కారణాలన్నింటినీ వారిద్దరికీ కమిషనర్ వివరించారు. ఆమె ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులను కూడా చెప్పారు. కాగా, ప్రీతి ఆత్మహత్య చేసుకుందని తాము నమ్ముతున్నట్లు ఆమె తండ్రి నరేందర్ చెప్పారు. సీపీతో మాట్లాడిన తర్వాత ఉన్న అనుమానాలన్నీ నివృత్తి చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రీతి ఆత్మహత్యకు ఉపయోగించిన సిరంజి దొరికిందని, ఆమె ఫోరెన్సిక్ రిపోర్టులో కూడా శరీరంలో విషపదార్థాలు ఉన్నట్లు తేలిందని ఆయన మీడియాకు వెల్లడించారు.

పోలీసులు అన్ని వివరాలు వెల్లడించారు. కానీ ఆ రిపోర్టును చూపించలేదని.. అయినా తమ కూతురుది ఆత్మహత్యే అని నమ్ముతున్నామన్నారు. అయితే, ప్రీతి ఆత్మహత్య వెనుక కేఎంసీ ప్రిన్సిపల్, హెచ్‌వోడీల బాధ్యతారాహిత్యం ఉందని ఆయన ఆరోపించారు. కాగా, వరంగల్ పోలీసులు పోలీసుల ఆత్మహత్య కేసును సీరియస్‌గా తీసుకున్నారు. ప్రీతి సక్సీనైల్ కోలిన్ అనే ఇంజక్షన్ తీసుకున్నదని, అందుకు సంబంధించిన వివరాల కోసం గూగుల్‌లో కూడా సెర్చ్ చేసిందని పోలీసులు వెల్లడించారు. టాక్సికాలజీ రిపోర్టు కోసం బ్లడ్ శాంపిల్స్ తీసుకొని పంపారు. అయితే ఆ రిపోర్టులో ఎలాంటి విషపదార్థాలు ఉన్నట్లు బయటపడలేదు.

దీంతో పోలీసులు ఫోరెన్సిక్ రిపోర్టు కోసం వెయిట్ చేశారు. తాజాగా దానికి సంబంధించిన నివేదిక అందింది. ప్రీతి శరీరంలో విషపదార్థాలు ఉన్నట్లు ఆ రిపోర్టులో తేలింది. దీంతో ఆమెది ఆత్మహత్యగానే నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు ప్రకటన చేశారు.

First Published:  22 April 2023 6:04 PM IST
Next Story