Telugu Global
CRIME

యూపీలో మరో ఘోరం.. కేసు వెనక్కి తీసుకోలేదని అత్యాచార బాధితురాలి హత్య

కేసు వెనక్కు తీసుకోవాల్సిందిగా బాధితురాలి కుటుంబాన్ని మరోసారి బెదిరించారు. అయినప్పటికీ వారు వినకపోవడంతో కక్ష పెంచుకున్నారు.

యూపీలో మరో ఘోరం.. కేసు వెనక్కి తీసుకోలేదని అత్యాచార బాధితురాలి హత్య
X

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ సంఘటన జరిగింది. అత్యాచారం కేసును వెనక్కి తీసుకోవడం లేదని బెయిల్‌పై వచ్చిన నిందితుడు బాధితురాలిని గొడ్డలితో వెంటాడి హత్య చేశాడు. కౌషంబి జిల్లా దేర్హా గ్రామంలో ఈ దుర్ఘ‌టన జరిగింది. నడిరోడ్డులో అందరూ చూస్తుండగానే ఈ హత్య జరగడం యూపీలో తీవ్ర కలకలం రేపింది. పవన్ అనే యువకుడు మూడేళ్ల కిందట పదహారేళ్ల బాలికపై స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పవన్‌ను అరెస్టు చేశారు.

అయితే తనపై పెట్టిన కేసును వెనక్కు తీసుకోవాలని గత మూడేళ్లుగా నిందితుడు బాధిత కుటుంబాన్ని, యువతిని బెదిరిస్తూనే ఉన్నాడు. అయినా వారు వెనక్కి తగ్గలేదు. జైల్లో ఉన్న పవన్ రెండు రోజుల కిందట బెయిల్‌పై విడుద‌ల‌య్యాడు. అదే సమయంలో మరో కేసులో జైలుకు వెళ్లిన అతడి సోదరుడు అశోక్ నిషాద్ కూడా బెయిల్‌పై వచ్చాడు. వీరిద్దరూ కలిసి అత్యాచార కేసును ఎలాగైనా క్లోజ్ చేయించాలని ప్రయత్నించారు.

కేసు వెనక్కు తీసుకోవాల్సిందిగా బాధితురాలి కుటుంబాన్ని మరోసారి బెదిరించారు. అయినప్పటికీ వారు వినకపోవడంతో కక్ష పెంచుకున్నారు. బాధిత యువతిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. యువతి రోజూ పశువులను తోలుకెళ్లడం వారు గుర్తించారు. ఆ సమయంలో ఆమెను చంపడం సులువు అని భావించారు.

యువతి రోజులాగే పశువులను కాసుకొని ఇంటికి వస్తుండగా పవన్, అశోక్ నిషాద్ ఆమెను అడ్డగించారు. గొడ్డలితో వెంటాడి వేటాడి నరికి చంపి.. అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు. అందరూ చూస్తుండగా నడిరోడ్డుపైనే ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనను చూసిన స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి తరలించారు. నిందితులను అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ బ్రిజేష్ శ్రీవాత్సవ తెలిపారు.

కాగా, యువతి హత్యపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించింది. నేరస్థులకు చట్టాల పట్ల భయంగానీ, గౌరవం గానీ లేవని పేర్కొంది. ఆడపిల్లలకు స్వేచ్ఛ ఎప్పుడు లభిస్తుందోనని ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలను వేధించిన వారిపై యమరాజు కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాడని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరిక జారీచేసిన కొద్ది రోజుల్లోనే ఈ సంఘటన జరగడం సంచలనం సృష్టిస్తోంది.

First Published:  21 Nov 2023 7:23 PM IST
Next Story