Telugu Global
CRIME

లాకప్ డెత్ కేరాఫ్ ఉత్తర ప్రదేశ్..

పోలీస్ కస్టడీల్లో ఎంతమంది చనిపోయారు, ఎలా చనిపోయారు అనే విషయాలను లోక్‌ సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ వెల్లడించారు. అనుకోకుండా యూపీ పరువుని బజారుకీడ్చారు.

లాకప్ డెత్ కేరాఫ్ ఉత్తర ప్రదేశ్..
X

2020-22 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 4,448 కస్టడీ మరణాలు చోటుచేసుకోగా, ఒక్క ఉత్తర ప్రదేశ్ లోనే 952 మంది మరణించారు. అంటే కస్టడీ మరణాల్లో దాదాపుగా నాలుగోవంతు యూపీలోనే బయటపడ్డాయి. అంటే యూపీలో పోలీస్ స్టేషన్లు, జైళ్లు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. యూపీలో పోలీసులు నేరస్తుడిని కస్టడీలోకి తీసుకున్నారంటే ప్రాణంతో బయటకొస్తాడో లేదో కూడా తెలియదు. అక్కడ మరణ శిక్షలు విధించేది కోర్టులు కాదు, పోలీసులే అనే ప్రచారం ఉంది. దేశంలో పోలీస్ కస్టడీల్లో ఎంతమంది చనిపోయారు, ఎలా చనిపోయారు అనే విషయాలను లోక్‌ సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ వెల్లడించారు. అనుకోకుండా యూపీ పరువుని బజారుకీడ్చారు.

ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడుల విషయంలో దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో ఎక్కువశాతం బీజేపీ పాలిత రాష్ట్రాలదే వాటా. ఈ విషయం కూడా ఇటీవల లోక్ సభలో కేంద్ర మంత్రి లిఖిత పూర్వకంగా వెల్లడించారు. ఇప్పుడు కస్టడీ మరణాల్లో కూడా తమ పార్టీ పాలిత రాష్ట్రాలే టాప్ అని చెప్పుకోక తప్పలేదు.

దేశంలో 2016-ఏప్రిల్‌ -2022-మార్చి మధ్య 11,656 మంది కస్టడీల్లోనే కన్నుమూశారు. కస్టడీ మరణాల్లో ఎక్కువగా జ్యుడీషియల్‌ కస్టడీలో మరణించినవారి సంఖ్యే అత్యథికం. జ్యుడీషియల్‌ కస్టడీలో మరణించినవారు 93 శాతం కాగా, పోలీస్‌ కస్టడీలో చనిపోయినవారు 7 శాతం. రాష్ట్రాల‌ వారీగా పరిశీలిస్తే ఆరేళ్లలో కస్టడీ మరణాల్లో 22 శాతంతో యూపీ టాప్ ప్లేస్ లో ఉంది. దేశవ్యాప్తంగా చోటుచేసుకొన్న కస్టడీ మరణాల్లో సగటున కోటి మంది జనాభాకు 85 మంది చనిపోయారని నివేదికలు చెబుతున్నాయి.

2020లో కస్టడీ మరణాలు మొత్తం 1,887 కాగా అందులో సహజ మరణాలు1,642. అసహజ మరణాలు 189. అసహజ మరణాల విషయానికొస్తే.. కస్టడీలో ఆత్మహత్య చేసుకుని చనిపోయినవారి సంఖ్య 156. ఇక కస్టడీలో ప్రమాదవ శాత్తు 8మంది చనిపోగా, తోటి ఖైదీల చేతుల్లో మరో 8మంది మృత్యువాత పడ్డారు. కాల్పుల్లో ఐదుగురు, అనుమానాస్పదంగా ఉరికి వేలాడి నలుగురు, బయటి వారి దాడుల్లో ముగ్గురు, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒకరు చనిపోయినట్టు లోక్ సభకు కేంద్ర మంత్రి తెలిపారు.

First Published:  28 July 2022 7:08 AM IST
Next Story