బధిరుల పాఠశాలలో ఘోరం.. విద్యార్థి నోట్లో టర్పెంటైన్ ఆయిల్ పోసి నిప్పంటించి..
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చందు తనపై దాడి చేసిన వారి పేర్లను చేతిపై రాసి చూపించాడు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం విద్యార్థుల మధ్య సాధారణ గొడవగా మొదలై ఆవేశంలో కొందరు విద్యార్థులు చందుపై ఆయిల్ పోశారు.
తిరుపతి బధిరుల పాఠశాలలో విద్యార్థుల మధ్య చిన్నగా మొదలైన ఘర్షణ ఒక విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది. కోపంలో ఓ విద్యార్థిపై సహచర విద్యార్థులు టర్పెంటైన్ ఆయిల్ పోసి నిప్పంటించారు. 70 శాతం గాయాలైన బాలుడిని ఆస్పత్రిలో చేర్పించగా పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.
వడమాలపేట రజక వీధికి చెందిన దాము కుమారుడు చందు టీటీడీ చెవిటి మూగ పాఠశాలలో చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం చందు కాలిపోయిన గాయాలతో కనపడటంతో వెంటనే స్కూల్ సిబ్బంది బాలుడిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. తక్షణ సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకున్నారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చందు తనపై దాడి చేసిన వారి పేర్లను చేతిపై రాసి చూపించాడు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. విద్యార్థుల మధ్య సాధారణ గొడవగా మొదలై ఆవేశంలో కొందరు విద్యార్థులు చందుపై ఆయిల్ పోశారు. అంతటితో ఆగకుండా అగ్గిపెట్టె సంపాదించుకొచ్చి అతనికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో చందు శరీరం 70 శాతం కాలిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మెజిస్ట్రేట్ కూడా వాంగ్మూలం తీసుకున్నారు.
అయితే దాడి చేసిన వారిని కాపాడేందుకు హాస్టల్ వార్డెన్, సిబ్బంది ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే హాస్టల్‌లో సీసీ ఫుటేజ్ పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.