గచ్చిబౌలిలో కానిస్టేబుల్‌పై కాల్పులు జరిపిన దొంగ
గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌లో జరిగిన ఘటన
గచ్చిబౌలిలో కాల్పుల ఘటన కలకలం రేపింది. శనివారం రాత్రి దొంగను పట్టుకోవడానికి వెళ్లిన సైబరాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ వెంకటరాంరెడ్డిపై దుండగుడు రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఓ బుల్లెట్ కానిస్టేబుల్ తొడభాగంలోకి దూసుకెళ్లింది. కానిస్టేబుల్‌తో పాటు పబ్‌లో ఉన్న బౌన్సర్‌కు కూడా గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరినీ చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.కాల్పుల ఘటన గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌లో జరిగిందని పోలీసులు తెలిపారు. కాల్పుల జరిపిన దొంగ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్‌గా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రభాకర్‌పై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 80 కేసులు
కానిస్టేబుల్‌పై కాల్పులకు తెగబడిన బత్తుల ప్రభాకర్‌పై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు పోలీస్ స్టేషన్లలో సుమారు 80 కేసులు ఉన్నాయని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్‌కు ప్రభాకర్ వచ్చాడనే సమాచారంతో పోలీస్ సిబ్బంది వెళ్లారు. పోలీసులను చూసి ప్రభాకర్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మాదాపూర్ సీసీఎస్ కానిస్టేబుల్ వెంకటరెడ్డికి గాయాలయ్యాయి. విశాఖ జైలు నుంచి నిందితుడు తప్పించుకుని వచ్చినట్టు సమాచారం వచ్చింది. 2023 నుంచి ప్రభాకర్ పరారీలో ఉన్నాడు. అతని నుంచి రెండు తుపాకులు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నాం. గాయపడిన కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నది. దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీసీపీ తెలిపారు.