అల్లు అర్జున్ హడావిడితోనే మహిళ ప్రాణం పోయింది
అయినా కేసు పెట్టొద్దా.. ఆజ్ తక్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి
అల్లు అర్జున్ హడావిడితో మహిళ ప్రాణం పోయిందని, ఆమె కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడని.. అయినా కేసు పెట్టొద్దా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో ఆజ్ తక్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. దేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉందని, దానికి అనుగుణంగానే చట్టం పనిచేస్తుందని తెలిపారు. గతంలో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ ఎందుకు అరెస్ట్ అయ్యారు.. చట్ట ప్రకారమే కదా అని ప్రశ్నించారు. మహిళ చనిపోతే కేస్ బుక్ అయ్యింది.. పది రోజుల తర్వాత పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు, జనం ప్రాణాలు పోయినా కేసులు పెట్టొద్దా చెప్పాలన్నారు. ఫిలిం స్టార్లు, పొలిటికల్ స్టార్ల కోసం ప్రత్యేకంగా ఏముండదని, చట్టం ముందు అందరూ సమానమేనని తెలిపారు. కారులో వచ్చి సినిమా చూసి వెళ్తే ఎలాంటి సమస్య ఉండకపోయేదని.. కారులోంచి బయటకు వచ్చి చేతులు ఊపి హడావిడి చేశాడని, దీంతో జనం ఎగబడ్డారని వారిని కంట్రోల్ చేయలేకపోయారని తెలిపారు. ఈ కేసులో అల్లు అర్జున్‌పై ఏ11గా పోలీసులు పేర్కొన్నారని చెప్పారు.
సంధ్య థియేటర్ వద్ద మహిళ ప్రాణాలు పోవడానికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. తనకు అల్లు అర్జున్ చిన్నపటి నుంచి తెలుసని.. ఆయనకు తాను తెలుసు అన్నారు. అల్లు అర్జున్ మామ చిరంజీవి కాంగ్రెస్ పార్టీ నాయకుడని చెప్పారు. అల్లు అర్జున్ కు పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడని, తనకు బంధువని, అల్లు అర్జున్ భార్య కూడా తమ బంధువేనని తెలిపారు. హోం శాఖ కూడా తన వద్దనే ఉందని, ఈ కేసుకు సంబంధించిన వివరాలన్నీ తనకు తెలుసు అన్నారు. చనిపోయిన మహిళ కొడుకు ఇంకా కోమాలోనే ఉన్నాడని చెప్పారు. సినిమా కోసం పైసలు ఖర్చు పెట్టారు.. సంపాదించుకున్నారు.. వాళ్లు దేశం కోసం చేసిందేమి లేదన్నారు. కృష్ణ తన ఫెవరెట్ హీరో అని, ఆయన ఇప్పుడు లేడన్నారు. ఇప్పుడు తానే స్టార్ ను అని.. తనకు ఫ్యాన్స్ ఉంటారు కదా.. ఉండాలి కదా అన్నారు. కేసు పెట్టకపోతే తను ప్రజలు ప్రశ్నించరా అన్నారు. పుష్ప -2 బెనిఫిట్ షోకు తమ ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందన్నారు.