Telugu Global
CRIME

రణరంగంగా ఛత్తీస్‌గఢ్‌-ఒడిషా సరిహద్దు అటవీ ప్రాంతం

ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు 27 మంది మావోయిస్టులు మృతి..ఎదురుకాల్పుల్లో మృతి చెందిన వారిలో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు చలపతి ,మనోజ్‌ అలియాస్‌ మోడం బాలకృష్ణ

రణరంగంగా ఛత్తీస్‌గఢ్‌-ఒడిషా సరిహద్దు అటవీ ప్రాంతం
X

ఛత్తీస్‌గఢ్‌-ఒడిషా సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్‌ కొనసాగుతున్నది. గరియాబంద్‌, నౌపాడ జిల్లాల్లో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్లుల్లో ఇప్పటివరకు 27 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. భీకర ఎన్‌కౌంటర్‌ కొనసాగుతుండటంతో రెండు రాష్ట్రాల సరిహద్దులోని అటవీ ప్రాంతం రణరంగంగా మారింది. ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు 27 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. మరికొంతమందికి తీవ్రగాయాలవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఇప్పటివరకు 16 మంది మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టులను చుట్టుముట్టిన కోబ్రా సైనికులు లొంగిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఏకే 47లతో మావోయిస్టులు పెద్ద ఎత్తున కాల్పులు జరుపుతున్నారు. ఘటనా స్థలంలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు ఆపరేషన్‌ ముమ్మరం చేశాయి.

ఈ ఎదురుకాల్పుల్లో మృతి చెందిన వారిలో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఉన్నారు. మావోయిస్టుపార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఒడిషా రాష్ట్ర కార్యదర్శి చలపతి అలియాస్‌ రామచంద్రారెడ్డి ఉన్నారు. ఆయనపై రూ. కోటి రివార్డును ప్రభుత్వం గతంలో ప్రకటించింది. చలపతి స్వస్థలం చిత్తూరు జిల్లా. ఇంకా మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్‌ అలియాస్‌ మోడం బాలకృష్ణ, స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడు గుడ్డు కూడా ఉన్నట్లు రాయ్‌పూర్‌ రేంజ్‌ ఐటీ అమ్రేశ్‌ తెలిపారు.

First Published:  21 Jan 2025 8:33 PM IST
Next Story