మూడు రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్
పలు రకాల స్కీమ్‌ల పేరుతో ప్రజల సొమ్ము కొల్లగొట్టడంలో ఆరితేరిన సూరినేని ఉపేందర్ (42).. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో తన కార్యకలాపాలు సాగించాడు.
మూడు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్న ఆర్థిక నేరగాడు ఎట్టకేలకు తెలంగాణ సీఐడీకి చిక్కాడు. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం మక్కపల్లిలో సీఐడీ ఆర్థిక నేర విభాగం శుక్రవారం అతన్ని అరెస్టు చేసింది. అతనితో పాటు ఆర్థిక నేరాల్లో పాలుపంచుకున్న మరో నిందితుడు చంద్రశేఖర్ 2021 సెప్టెంబరు 1న అరెస్టవగా, అప్పటినుంచి పరారీలో ఉన్న ఉపేందర్ ఎట్టకేలకు చిక్కాడు.
పలు రకాల స్కీమ్‌ల పేరుతో ప్రజల సొమ్ము కొల్లగొట్టడంలో ఆరితేరిన సూరినేని ఉపేందర్ (42).. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో తన కార్యకలాపాలు సాగించాడు. అతని స్వస్థలం సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ మండలం. తొలుత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన ఉపేందర్.. మరో ఆర్థిక నేరగాడు గాలా చంద్రశేఖర్‌తో కలిసి విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంలో సురక్షా ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రారంభించాడు. విశాఖలో తక్కువ ధరకే ఇళ్ల స్థలాలు ఇస్తామంటూ ప్రజలను మోసం చేయడంతో అప్పట్లో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.
ఏర్పాటు చేసిన సంస్థలు.. చేసిన మోసాలు ఇలా..
విశాఖ అరెస్టు తర్వాత అక్కడి నుంచి బెంగళూరుకు మకాం మార్చిన ఉపేందర్.. అక్కడ చంద్రశేఖర్‌తో కలిసి బెంగళూరు హెచ్ఎస్ఆర్ లే అవుట్‌లో ఎస్ఆర్ బ్లూ చిప్స్ పేరిట నకిలీ కంపెనీని ఏర్పాటు చేసి ప్రజల నుంచి డబ్బు వసూలు చేశాడు. తిరుపతిలో డేర్ టు డ్రీమ్ నెట్‌వర్క్ ప్రొడక్ట్ కంపెనీ, లార్డ్ సాయిబాలాజీ రియల్ ఎస్టేట్ వెంచర్స్‌ను ఏర్పాటు చేశాడు. కర్నాటకలోనే ఆంబిడెంట్ ఫైనాన్షియల్ పేరుతో స్కామ్ చేసి వందల కోట్ల రూపాయల్లో మోసాలకు పాల్పడ్డాడు. ఆ కేసులో కర్నాటక సీఐడీ దర్యాప్తు ప్రారంభించింది. ఇందులో మనీ ల్యాండరింగ్ కూడా ఉండటంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది.
మోసాలకు పాల్పడుతున్న ఉపేందర్, చంద్రశేఖర్‌లపై 2020లో తెలంగాణ సీఐడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఆన్‌లైన్ ఫారెక్స్ ట్రేడింగ్ పేరిట ఈ బృందం మోసాలకు పాల్పడగా, 2017లో కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కోర్కల్‌కు చెందిన కర్ర కరుణాకరరెడ్డి నుంచి కోటి రూపాయల వరకు వసూలు చేసి మోసగించారనే అభియోగంపై సీఐడీ దర్యాప్తు చేపట్టింది. తాజాగా సీఐడీ చీఫ్ మహేష్ భగవత్ ఆదేశాలతో ఆర్థిక నేరాల విభాగం అతన్ని అరెస్టు చేసింది.