గుప్తనిధుల పేరుతో హత్యలు, తీర్ధంలో పాయిజన్ .. సీరియల్ కిల్లర్ అరెస్ట్
గుప్తా నిధుల మీద ఆశతో ఉన్నవారిని టార్గెట్ చేసి, తాంత్రిక పూజల పేరుతో వారి నుంచి డబ్బులు గుంజి, గట్టిగా ప్రశ్నిస్తే ప్రాణాలు తీసే ఒక నరహంతకుడు పోలీసుల చేతికి చిక్కాడు.
గుప్తా నిధుల మీద ఆశతో ఉన్నవారిని టార్గెట్ చేసి, తాంత్రిక పూజల పేరుతో వారి నుంచి డబ్బులు గుంజి, గట్టిగా ప్రశ్నిస్తే ప్రాణాలు తీసే ఒక నరహంతకుడు పోలీసుల చేతికి చిక్కాడు. పూజలు, తీర్థం అనే పేరుతో నోట్లో యాసిడ్ పోసి.. ఏకంగా 11 మందిని పొట్టనబెట్టుకున్న సీరియల్ కిల్లర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలానికి చెందిన రియల్‌ఎస్టేట్ వ్యాపారి వెంకటేశ్ హైదరాబాద్‌లోని బొల్లారంలో నివసించేవారు. నవంబరులో వెంకటేశ్ దారుణ హత్యకు గురయ్యాడు. వెంకటేశ్ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.
వెంకటేశ్ కు నాగర్ కర్నూల్‌లోని ఇంద్రానగర్ కాలనీకి చెందిన రామటి సత్యనారాయణతో కొంతకాలంగా పరిచయం ఉంది. అయితే సత్యనారాయణపై తమకు అనుమానంగా ఉందని వెంకటేశ్ కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. రంగంలోకి దిగిన పోలీసులు సత్యనారాయణను ఇప్పటికీ 11 మందిని హత్య చేసిన సీరియల్ కిల్లర్ గా గుర్తించారు. 2020 నుంచి ఇప్పటి వరకు 8 కేసుల్లో సత్యనారాయణ నిందితుడిగా ఉన్నట్లు తెలిపారు. నిందితుడి నుంచి పాయిజన్ బాటిల్స్‌తో పాటు బాధితుల ఫోన్లు, 10 సిమ్‌కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ కారు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు గుప్త నిధులపై అమాయకులకు ఉన్న ఆశని తన ఎరగా మార్చుకున్నాడు. తాంత్రిక పూజలు చేసి గుప్త నిధులు కనిపెడుతానని నమ్మించేవాడు. అమాయకుల నుంచి డబ్బు, స్థలాలు, భూములు రాయించుకునేవాడు. ఈ క్రమంలో వారి పేరిట ఉన్న భూములు, ఇతర ఆస్తిపాస్తులను తన పేరిట, తన అనుయాయుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడు. ఎవరైనా తిరగబడి ప్రశ్నించితే వారిని అతి దారుణంగా హత్య చేసేవాడు.
వనపర్తి, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, కర్ణాటకలోని బలగనూరు, ఏపీలోని అనంతపురం జిల్లాల్లో హత్యలు జరిగినట్టు సమాచారం. నిందితుడిది ఎక్స్ స్ట్రీమ్ సైకో మెంటాలిటీగా పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. ఇలాంటి వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.