దొంగను పోలీస్ స్టేషన్‌లో పెట్టుకొని.. ఊరంతా వెదికిన పోలీసులు
పాత నేరస్తుల లిస్టును కూడా పరిశీలించారు. కానీ ఎక్కడా ఆచూకీ లభించలేదు.
చంకలో పిల్లాడిని పెట్టుకొని ఊరంతా వెతికినట్లు తయారయ్యింది బంజారాహిల్స్ పోలీసుల పరిస్థితి. వజ్రాలు దొంగిలించిన ఓ ఘరానా దొంగ పోలీస్ స్టేషన్‌లో తమ కళ్లెదుటే ఉన్నా.. 10 గంటల పాటు ఊరంతా గాలించారు. ఆ దొంగను పట్టుకోవడానికి ఇతర పోలీస్ స్టేషన్లను కూడా అప్రమత్తం చేసి నానా హైరానా పడ్డారు. చివరకు ఆ దొంగే చెప్పే వరకు అసలు విషయాన్ని పోలీసులు గుర్తించలేక పోయారు. వివరాల్లోకి వెళితే.. కేంద్ర మాజీ మంత్రి చెంచు రామయ్య మనుమడు పవన్ కుమార్‌కు ఓ నగల తయారీ కర్మాగారం ఉంది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న ఈ షాప్ నుంచి ఈ నెల 20న రూ.1 కోటి విలువైన నగలు, వజ్రాలు మాయం అయ్యాయి.
మరుసటి రోజు జ్యూవెలరీ, డైమండ్స్ పోయిన విషయాన్ని గుర్తించిన యాజమాన్యం వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమేరాలను పరిశీలించినా దొంగ గురించి పూర్తి వివరాలు తెలియలేదు. నిందితుడు ఒక పాత బైక్ మీద నగలతో పారిపోయిన సీన్ ఒకటే రికార్డు అయ్యింది. దీంతో దొంగ కోసం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అన్ని పోలీస్ స్టేషన్లకు దొరికిన క్లూస్‌తో సమాచారం పంపించారు. పాత నేరస్తుల లిస్టును కూడా పరిశీలించారు. కానీ ఎక్కడా ఆచూకీ లభించలేదు.
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లోనే మరో కేసు నమోదైంది. ప్రవీణ్ అనే వ్యక్తికి చెందిన రెండు సెల్ ఫోన్లు చోరీకి గురయ్యాయి. సీసీ కెమేరాలు పరిశీలించగా.. సింగాడికుంట బస్తీకి చెందిన పవన్ దొంగిలించినట్లుగా తేలింది. దీంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని ప్రవీణ్ బెదిరించడంతో.. ర్యాపిడో ద్వారా కొట్టేసిన రెండు ఫోన్లను కూడా పవన్ తిరిగి పంపించాడు. అయితే, ఫోన్లతో పాటు నగదు కూడా పోయినట్లు ప్రవీణ్ చెప్పడంతో.. ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు.
ఫోన్లు ఇచ్చేశాను కాబట్టి తనను ఎవరూ ఏమీ చేయరని భావించిన పవన్.. తాపీగా బంజారాహిల్స్‌లో తిరుగుతున్నాడు. కానీ ప్రవీణ్ స్నేహితుడు ఇతడిని గమనించి పోలీసులకు పట్టించాడు. అతడి టూవీలర్‌ను కూడా తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తీసుకొని పోయాడు. అప్పటి నుంచి అతడు పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నాడు. మరోవైపు పోలీసులు వజ్రాల దొంగ కోసం తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా, స్టేషన్‌లో టేబుల్ మీద ఉన్న మాగ్నిఫయింగ్ గ్లాస్ (బూతద్దం) చూసి అది తనదే అని పవన్ చెప్పాడు. వెంటనే అప్రమత్తం అయిన పోలీసులు అతడిని తమదైన శైలిలో విచారించగా వజ్రాల దొంగతనం విషయం బయటపెట్టాడు.
సింగాడికుంటకు చెందిన అంజితో కలసి చోరీచ ేశామని చెప్పాడు. పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన పాత టూవీలర్ లోపలే కొన్ని వజ్రాలు, బంగారు ఆభరణాలు దొరికాయి. దొంగిలించిన వాటిలో కొన్నింటిని మణప్పురం ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి లక్షన్నర రూపాయలు అప్పు తీసుకున్నట్లు కూడా చెప్పాడు. దీంతో పోలీసులు చాలా వరకు నగలు, వజ్రాలు రికవరీ చేశారు. స్టేషన్‌లోనే దొంగను పెట్టుకొని ఊరంతా తిరిగిన బంజారాహిల్స్ పోలీసుల వైఖరి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.