నాకు దక్కనిది.. ఇతరులకు దక్కకూడదనే.. - లీలా పవిత్ర హత్య కేసులో నిందితుడు దినకర్ వెల్లడి
వేరొకరికి దగ్గరవుతుందనే విషయం నన్ను ఎంతో బాధించింది.. ఒప్పించాలని ప్రయత్నించినా.. పట్టించుకోకపోవడంతో ఇక విసిగిపోయి చంపేయాలని నిర్ణయించుకున్నానని దినకర్ పోలీసు విచారణలో వెల్లడించాడు.
నాకు దక్కనిది ఇతరులకు దక్కకూడదనే లీలాను చంపేశా.. అంటూ కాకినాడ యువతి లీలా పవిత్ర హత్య కేసులో నిందితుడు దినకర్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. బెంగళూరులో మంగళవారం రాత్రి మురుగేశ్ పాళ్య వద్ద లీలాను అతను కత్తితో పొడిచి హతమార్చిన విషయం తెలిసిందే. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు చేపట్టిన ప్రాథమిక విచారణలో అతను ఈ విషయాలను వెల్లడించినట్టు జీవనబీమా నగర పోలీస్ స్టేషన్ సిబ్బంది తెలిపారు.
గాఢంగా ప్రేమించుకొని.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాక.. మాట మార్చింది.. అది తట్టుకోలేకే చంపేయాలని నిర్ణయించుకున్నా.. అని దినకర్ పోలీసుల ఎదుట వెల్లడించాడు. ఆమెను పెళ్లికి ఒప్పించాలని వారం రోజులుగా వెంటపడ్డానని, అయినా కనీసం మాట్లాడేందుకు కూడా నిరాకరించిందని దినకర్ తెలిపాడు. ఆఖరి క్షణంలోనైనా మనసు మార్చుకుంటుందని పలుమార్లు ఫోన్ చేశానని, అయినా స్పందించలేదని చెప్పాడు.
ఆమె ఇక నాది కాదు.. వేరొకరికి దగ్గరవుతుందనే విషయం నన్ను ఎంతో బాధించింది.. ఒప్పించాలని ప్రయత్నించినా.. పట్టించుకోకపోవడంతో ఇక విసిగిపోయి చంపేయాలని నిర్ణయించుకున్నానని దినకర్ పోలీసు విచారణలో వెల్లడించాడు. అందుకే దొమ్మలూరులోని ఒక దుకాణంలో కత్తి కొనుగోలు చేశానని, రెండుసార్లు దాడి చేయాలని ప్రయత్నించినా.. లీలా ముఖం చూసి.. ఏమీ చేయలేకపోయానని చెప్పాడు. చివరికి మంగళవారం రాత్రి మనసు రాయి చేసుకుని కత్తితో కసితీరా పొడిచి హత్య చేశానని వెల్లడించాడు.
దినకర్ స్వస్థలం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం రెల్లివలస గ్రామం. విశాఖపట్నంలో ఎమ్మెస్సీ చదివే సమయం నుంచీ తామిద్దరం చనువుగా ఉన్నామని, ఐదేళ్ల కిందట నగరానికి వచ్చి ఉద్యోగంలో చేరామని, ఇద్దరం ప్రేమించుకున్నామని పోలీసుల ఎదుట దినకర్ వెల్లడించాడు. కులాల కట్టుబాట్లు దాటి పెళ్లి చేసుకునేందుకు, సహజీవనం చేసేందుకు ఆమెపై ఒత్తిడి చేసినా ఒప్పుకోలేదని చెప్పాడు.
లీలాను నేను ఎంతో ఇష్టంగా ప్రేమించా.. మనసంతా ఆమే.. లీలా లేని లోకం ఊహించలేకపోయా.. ఇలా మారుతానని కలలో కూడా అనుకోలేదని పోలీసుల విచారణలో దినకర్ తెలిపాడు. గురువారం ఉదయం నిందితుడిని నగర మెట్రోపాలిటన్ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి.. పరప్పన అగ్రహార కేంద్ర కారాగారానికి తరలించారు. లీలా పవిత్ర మృతదేహానికి కుటుంబసభ్యులు బెంగళూరులోనే అంత్యక్రియలు నిర్వహించారు.