హైదరాబాద్‌లో నకిలీ గన్ లైసెన్సుల ముఠా.. - గుట్టు రట్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు
కశ్మీర్‌కు చెందిన అల్తాఫ్ హుస్సేన్ 2013లో ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చాడు. తొలుత గ్రేస్ మేనేజ్‌మెంట్ సెక్యూరిటీ సర్వీస్‌లో పనిచేశాడు. అనంతరం ఎస్ఐఎస్ క్యాష్ సర్వీస్‌లో గన్‌మెన్‌గా చేశాడు.
అక్రమార్జనే లక్ష్యంగా మోసగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోసాలకు తెర తీస్తూ.. పోలీసులకు సవాళ్లు విసురుతూనే ఉన్నారు. ఇలాంటిదే హైదరాబాద్‌లో వెలుగుచూసిన తాజా ఉదంతం. ఇప్పటివరకు నకిలీ సర్టిఫికెట్లు తయారుచేసి విక్రయిస్తున్నముఠాలను చూశాం. కానీ, తాజా ముఠా ఏకంగా నకిలీ గన్ లైసెన్సులనే తయారుచేసి అమ్మేస్తోంది. వీరి వ్యవహారంపై సమాచారం అందుకున్న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మాటేసి.. వీరి గుట్టు రట్టు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం ఈ వివరాలు వెల్లడించారు.
కశ్మీర్‌కు చెందిన అల్తాఫ్ హుస్సేన్ 2013లో ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చాడు. తొలుత గ్రేస్ మేనేజ్‌మెంట్ సెక్యూరిటీ సర్వీస్‌లో పనిచేశాడు. అనంతరం ఎస్ఐఎస్ క్యాష్ సర్వీస్‌లో గన్‌మెన్‌గా చేశాడు. తన వద్ద తుపాకీ ఉంటే సెక్యూరిటీ సర్వీసులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయని భావించిన అల్తాఫ్.. తన సొంత రాష్ట్రం కశ్మీర్‌లోని రాజౌరి జిల్లాకు వెళ్లి నకిలీ లైసెన్సు తీసుకుని డబుల్ బ్యారెల్ గన్ కొన్నాడు.
ఈ క్రమంలోనే అతను హైదరాబాదుకు చెందిన స్టాంపు విక్రేత హఫీజుద్దీన్‌తో జట్టు కట్టాడు. నకిలీ గన్ లైసెన్సుల దందాకు తెరతీశాడు. రాజౌరీ మేజిస్ట్రేట్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ లైసెన్సులు ఇవ్వడం మొదలుపెట్టాడు. సెక్యూరిటీ ఏజెన్సీల్లో భద్రతా సిబ్బందిగా పనిచేయాలనుకునే కశ్మీర్, బీహార్, యూపీ తదితర రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగ యువతకు వాటిని ఇచ్చేవాడు.
వారు ఆ లైసెన్సులతో పూణే, నాగ్‌పూర్‌లకు వెళ్లి రూ.60 వేలు వెచ్చించి ఒరిజినల్ గన్‌లు కొనుగోలు చేసేవారు. తుపాకీ కొనుగోలు చేసిన యువతను సెక్యూరిటీ ఏజెన్సీల్లో పెట్టించేందుకు అల్తాఫ్ వారి నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.20 వేలు చొప్పున వసూలు చేసేవాడు. గ్రేస్ మేనేజ్‌మెంట్ సెక్యూరిటీ సర్వీస్, వెస్ట్ మారేడ్‌పల్లిలోని జిరాక్సు దుకాణం యజమాని ఐ.శ్రీనివాస్ నిందితులకు సహకరించారు.
టాస్క్‌ఫోర్స్ పోలీసులు వీరి గుట్టు రట్టు చేసి.. 30 సింగిల్, డబుల్ బ్యారెల్ గన్‌లు, ఒక రివాల్వర్, 140 బుల్లెట్లు, 34 నకిలీ లైసెన్సులు, 29 వినియోగించని లైసెన్సులు, నకిలీ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. నకిలీ లైసెన్సు వ్యవహారం ప్రజా భద్రతకు పెద్ద ముప్పు అని ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర కమిషనరేట్లు, జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేశామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.