Telugu Global
CRIME

నకిలీ సర్టిఫికెట్ల రాకెట్‌ గుట్టు రట్టు.. ఏపీ, తెలంగాణల్లో ఇప్పటికే 50 సర్టిఫికెట్ల విక్రయం

ఒక్కో సర్లిఫికెట్‌కు రూ.50 వేల నుంచి లక్షా 50 వేల రూపాయల వరకు వసూలు చేశారు. అయితే వీరి నకిలీ రాకెట్‌ గుట్టు తాజాగా రట్టయింది. పోలీసులు ఆదివారం నిందితులను అరెస్ట్ చేశారు.

నకిలీ సర్టిఫికెట్ల రాకెట్‌ గుట్టు రట్టు.. ఏపీ, తెలంగాణల్లో ఇప్పటికే 50 సర్టిఫికెట్ల విక్రయం
X

టోల్‌ ప్లాజాల్లో ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం అతనికి సంతృప్తినివ్వలేదు. మరింత ఆదాయం కోసం ఆలోచించి.. నకిలీ సర్టిఫికెట్ల తయారీనే సరైనదిగా భావించాడు. అతనికి మరో వ్యక్తి కూడా జత కలవడంతో వారిద్దరూ కలిసి ఈ రాకెట్‌ నడపాలని నిర్ణయించుకున్నారు. ఏడాదిన్నర కాలంలోనే ఏపీ, తెలంగాణల్లో దాదాపు 50 మందికి సర్టిఫికెట్లు విక్రయించారు. ఒక్కో సర్లిఫికెట్‌కు రూ.50 వేల నుంచి లక్షా 50 వేల రూపాయల వరకు వసూలు చేశారు. అయితే వీరి నకిలీ రాకెట్‌ గుట్టు తాజాగా రట్టయింది. పోలీసులు ఆదివారం నిందితులను అరెస్ట్ చేశారు. ఇంతకీ వీరు ఈ సర్టిఫికెట్ల తయారీకి యత్నించింది.. గూగుల్‌లో సెర్చ్‌ చేసి కావడం గమనార్హం. దీనిపై పోలీసులు ఆదివారం సాయంత్రం ఈ వివరాలను విలేకరులకు వెల్లడించారు.

ఏలూరు పట్టణంలో ఒక ప్రైవేట్‌ కళాశాలకు చెందిన నకిలీ సర్టిఫికెట్‌ అదే కళాశాలలో చదివే విద్యార్థి ఇచ్చిన సర్టిఫికెట్లలో రావడంతో యాజమాన్యానికి అనుమానం వచ్చి విచారణ చేపట్టింది. చింతలపూడికి చెందిన సోంబాబు దీనిని విక్రయించినట్టు తేలడంతో వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కొలకలూరి సోంబాబును అదుపులోకి తీసుకుని విచారణ చేయగా, ఏలూరు పట్టణంలోని బీడీ కాలనీకి చెందిన దినేష్‌తో కలిసి నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్నట్టు అంగీకరించాడు.

గూగుల్‌లో సెర్చ్‌ చేసి..

నిందితుడు దినేష్‌ గతంలో టోల్‌ ప్లాజాల్లో పనిచేసేవాడు. అక్కడ వచ్చే ఆదాయం సరిపోక నకిలీ సర్టిఫికెట్లు తయారు చేయాలన్న ఆలోచనతో గూగుల్‌లో సెర్చ్‌ చేసి నేర్చుకున్నాడు. నకిలీ సర్టిఫికెట్ల తయారీకి అవసరమైన సామగ్రిని చెన్నై వెళ్లి కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో అతనికి సోంబాబు పరిచయం కాగా, ఇద్దరూ కలిసి ఈ రాకెట్‌ నడపాలని నిర్ణయించుకున్నారు. గత ఏడాదిన్నర కాలంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 50 మందికి పైగా సర్టిఫికెట్లను విక్రయించారు. వివిధ యూనివర్సిటీలకు చెందిన సర్టిఫికెట్లతో పాటు పదో తరగతి, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్నారు.

అంతా ఆన్‌లైన్‌లోనే..

ఈ దందా అంతా ఫోన్‌ ద్వారానే నిర్వహిస్తుండటం గమనార్హం. ప్రత్యక్షంగా ఒకరినొకరు కలవకుండా అంతా ఆన్‌లైన్‌ ద్వారానే నకిలీ సర్టిఫికెట్ల దందా నడుపుతున్నారు. ఈ ముఠాలోని ప్రధాన నిందితులైన దినేష్, సోంబాబులను అరెస్ట్‌ చేసిన పోలీసులు వారి నుంచి వివిధ యూనివర్సిటీల రబ్బర్‌ స్టాంపులు, సర్టిఫికెట్లు, నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంప్‌ పేపర్లు, మొబైల్‌ ఫోన్లు, కంప్యూటర్, ప్రింటర్‌లను స్వాధీనం చేసుకున్నారు. వారి మొబైల్‌ డేటాను కూడా పరిశీలిస్తున్నారు. ఈ నకిలీ సర్టిఫికెట్లు తీసుకున్న వారిని కూడా గుర్తించి వారిపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. నిందితులకు సహకరించిన వారిని కూడా గుర్తించామని, వారిని కూడా త్వరలో అరెస్ట్‌ చేస్తామని వివరించారు.

First Published:  6 Nov 2023 9:30 AM IST
Next Story