Telugu Global
CRIME

ఉద్యోగాల పేరుతో దేశంలోనే అతి పెద్ద మోసం.. కీల‌క నిందితుడు అరెస్ట్

ఒడిశా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కేసుకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లోని సివిల్ లైన్స్‌లో నివసించే ప్ర‌ధాన నిందితులలో ఒకరైన జాఫర్ అహ్మద్ (25)ని పోలీసులు అరెస్టు చేశారు.

ఉద్యోగాల పేరుతో దేశంలోనే అతి పెద్ద మోసం.. కీల‌క నిందితుడు అరెస్ట్
X

ఉద్యోగాల పేరుతో జ‌రుగుతున్న భారీ స్కామ్‌ను ఒడిశా పోలీసులు ఛేదించారు. దేశంలోనే ఇది అతి పెద్ద ఉద్యోగాల స్కామ్ అని వెల్ల‌డించారు. ఈ కేసులో ఉత్త‌ర ప్ర‌దేశ్‌కు చెందిన కీల‌క నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు శ‌నివారం అత‌న్ని అలీఘ‌ర్‌లోని స్థానిక కోర్టులో హాజ‌రుప‌రిచారు. కోర్టు 5 రోజుల ట్రాన్సిట్ రిమాండ్‌ను విధించింది. త్వ‌ర‌లో భువనేశ్వర్‌లోని కోర్టులో పోలీసులు అత‌న్ని హాజరుపరచనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ కేంద్రంగా ఈ మోసం జ‌రుగుతున్న‌ట్టు ఒడిశా పోలీసు ఎక‌నామిక్ అఫెన్సిస్ వింగ్ గుర్తించింది. గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువత లక్ష్యంగా వీరు మోసాల‌కు పాల్ప‌డుతున్న‌ట్టు పోలీసులు తెలిపారు.

ఒడిశా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కేసుకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లోని సివిల్ లైన్స్‌లో నివసించే ప్ర‌ధాన నిందితులలో ఒకరైన జాఫర్ అహ్మద్ (25)ని పోలీసులు అరెస్టు చేశారు. జాఫర్ వృత్తిరీత్యా ఇంజనీర్ (బీటెక్). ఈ కేసులో నిందితులు భారీ మొత్తంలో మోసాల‌కు పాల్ప‌డిన‌ట్టు గుర్తించామ‌ని, వాటి వెలికితీత‌కు ద‌ర్యాప్తు కొన‌సాగించ‌నున్న‌ట్టు డీఐజీ జేఎన్ పంక‌జ్ చెప్పారు.

50 వేల మంది బాధితులు..

దేశ‌వ్యాప్తంగా క‌నీసం 50 వేల మంది ఉద్యోగాలు ఆశించి ఈ ముఠా చేతిలో మోస‌పోయార‌ని పోలీసులు తెలిపారు. వీరినుంచి ముఠా వ‌సూలు చేసిన మొత్తం కోట్ల రూపాయ‌ల్లో ఉంటుంద‌ని వివ‌రించారు. కొంతమంది నిపుణులైన వెబ్‌సైట్ డెవలపర్ల సహాయంతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన అత్యంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఇంజనీర్ల బృందం ఈ స్కామ్‌ను నడుపుతోందని వారు చెప్పారు.

50 మంది కాల్ సెంట‌ర్ ఉద్యోగులు..

ఈ ముఠా ఆధ్వ‌ర్యంలో 50 మంది కాల్ సెంట‌ర్ ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు. వీరికి ఒక్కొక్క‌రికి రూ.15 వేల చొప్పున వేత‌నం అందిస్తున్నార‌ని తెలిపారు. వీరంతా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని జ‌మాల్‌పూర్‌, అలీగ‌ఢ్ ప్రాంతాల‌కు చెందిన‌వార‌ని చెప్పారు.

1000కి పైగా న‌కిలీ సిమ్‌లు..

ఈ స్కామ్ కోసం నిందితులు 1000 కంటే ఎక్కువగా న‌కిలీ సిమ్‌లు, 530 హ్యాండ్‌సెట్‌లు, మొబైల్ ఫోన్ల‌ను ఉప‌యోగించార‌ని పోలీసులు తెలిపారు. ఈ ముఠాలోని నిందితులు చాలా చురుగ్గా వ్య‌వ‌హ‌రిస్తార‌ని, పోలీసుల‌, చ‌ట్టాల‌ను అమ‌లు చేసే సంస్థ‌ల ప్ర‌తి క‌ద‌లిక‌నూ వీరు ఊహించి ముందుకు సాగుతున్నార‌ని చెప్పారు.

ప‌క‌డ్బందీ సెట‌ప్‌తో..

ఈ ముఠా త‌మ కార్య‌క‌లాపాల‌ను చాలా ప‌క‌డ్బందీగా నిర్వ‌హిస్తోంది. న‌కిలీ సిమ్ కార్డుల‌ను వీరు వినియోగించేవారు. త‌మ వ్య‌క్తిగ‌త ఫోన్ల‌ను మోసానికి ఎలాంటి సంద‌ర్భంలోనూ వినియోగించేవారు కాదు. ఈ విష‌యంలో క‌ఠినమైన క్ర‌మ‌శిక్ష‌ణ పాటిస్తున్నారు. కాల్స్ కూడా వాట్సాప్ ద్వారా మాత్ర‌మే చేసేవారు. జ‌న్ సేవా కేంద్రం అనే పేరుతో త‌మ సిమ్‌లను ఉప‌యోగించేవారు. ట్రూకాల‌ర్‌లో వారి పేరు న‌మోదు కాకుండా ఈ కేంద్రం పేరు మాత్ర‌మే క‌న‌బ‌డేది. వారు జ‌న్ సేవా కేంద్రం ఖాతా ద్వారా మాత్ర‌మే డ‌బ్బును విత్‌డ్రా చేసేవారు.

ప్ర‌భుత్వ వెబ్‌సైట్‌ను పోలిన వెబ్‌సైట్ రూప‌క‌ల్ప‌న‌..

ఈ ముఠా ప్రభుత్వ వెబ్‌సైట్‌ను పోలిన వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేసింది. ప్రధానంగా ఆరోగ్య‌, నైపుణ్య శాఖ ఉద్యోగాలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలను ఇస్తోంది. ఈ ముఠా స్థానిక వార్తాపత్రికలలో ప్రకటనలు కూడా ఇచ్చింది. రిజిస్ట్రేష‌న్‌, ర‌క‌ర‌కాల కార్య‌క్ర‌మాలు, ఇంట‌ర్వ్యూ, శిక్ష‌ణ కోసం బాధితుల నుంచి రూ.3 వేల నుంచి రూ.50 వేల వ‌ర‌కు వ‌సూలు చేశారు. ఈ కేసులో మ‌రింత లోతైన విచార‌ణ కొన‌సాగిస్తామ‌ని ఒడిశా పోలీసులు తెలిపారు.

First Published:  1 Jan 2023 1:47 PM IST
Next Story