ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో తొమ్మిదో రోజు సహాయక చర్యలు
తవ్వకాలకు అడ్డంకిగా మారుతున్న నిరంతర నీటి ఊట

ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో తొమ్మిదో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రాడార్ సర్వే పరికరం ద్వారా టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మంది జాడను గుర్తించారు. వారిలో నలుగురిని నేడు సాయంత్రం బైటికి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మరో నలుగురు కాస్త సమయం పట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నిరంతరాయంగా ఊరుతున్న ఊట, కన్వేయర్ బెల్ట్ పనిచేయకపోవడం, వేల టన్నుల్లో పేరుకుపోయిన పూడిక వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నది. పూడిక, కత్తిరించిన టీబీఎం భాగాలను తరలించడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, హైడ్రా, సింగరేణి రెస్క్యూ బృందాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. షిఫ్టు 120 మంది చొప్పున మూడు షిఫ్టుల్లో సహాయక బృందాలు పనిచేస్తున్నాయి. సహాయక చర్యల్లో 18 ఏజెన్సీలు, 700 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నాయి. వనపర్తి జిల్లాలో పర్యటన ముగించుకుని సీఎం రేవంత్‌రెడ్డి నేరుగా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పరిశీలనకు రానున్నారు. సాయంత్రం సహాయక చర్యల పనితీరుపై సీఎం సమీక్షించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.