Telugu Global
CRIME

నిజామాబాద్ పీఎఫ్ఐ కేసులో చార్జిషీటు దాఖలు చేసిన ఎన్ఐఏ

పీఎఫ్ఐ శిబిరాన్ని నిర్వహిస్తున్న అబ్దుల్ ఖాదర్‌తో పాటు మరో 10 మందిపై చార్జ్ షీట్ దాఖలైంది. అమాయకులైన ముస్లిం యువకులను తమ ప్రసంగాలతో రెచ్చగొట్టి వారిని తమ సంస్థలో చేర్చుకుంటున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది.

నిజామాబాద్ పీఎఫ్ఐ కేసులో చార్జిషీటు దాఖలు చేసిన ఎన్ఐఏ
X

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)పై నిజామాబాద్‌లో నమోదైన కేసు ఆధారంగా నేషనల్ ఎంక్వైరీ ఏజెన్సీ (ఎన్ఐఏ) చార్జి షీటు దాఖలు చేసింది. దేశంలో పీఎఫ్ఐ ముసుగులో చేస్తున్న దేశ వ్యతిరేక కార్యకలాపాలపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ 11 మంది నిందితులపై నిందారోపణలు మోపింది. వీరిపై సెక్షన్ 120బి, 132ఏ, యూఏ(పీ)17, 18, 18ఏ, 18బి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. తెలంగాణ, ఏపీకి చెందిన పలువురిపై ఎన్ఐఏ అభియోగాలు మోపింది.

పీఎఫ్ఐ శిబిరాన్ని నిర్వహిస్తున్న అబ్దుల్ ఖాదర్‌తో పాటు మరో 10 మందిపై చార్జ్ షీట్ దాఖలైంది. అమాయకులైన ముస్లిం యువకులను తమ ప్రసంగాలతో రెచ్చగొట్టి వారిని తమ సంస్థలో చేర్చుకుంటున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. భారత ప్రభుత్వం, ఇతర సంస్థలు, వ్యక్తులపై రెచ్చగొట్టే ప్రసంగాలను పీఎఫ్ఐ చేస్తున్నట్లు ఎన్ఐఏ తమ చార్జి షీటులో పేరకొన్నది. ముస్లిం యువతను బలవంతంగా సంస్థలో చేర్చుకున్న తర్వాత వారికి.. యోగా క్లాసులు, ఫిజికల్ ఎడ్యుకేషన్, బిగినర్స్ కోర్సు వంటి పేరుతో దాడులకు సంబంధించిన శిక్షణ ఇస్తున్నట్లు తేల్చింది. ఇక రోజువారీ ఉపయోగించే కత్తి, కొడవలి, ఇనుప రాడ్లతో దాడులు ఎలా చేయాలి.. వ్యక్తులను ఎలా హతమార్చాలనే విషయాలను కూడా బోధిస్తున్నట్లు ఎన్ఐఏ తెలిపింది.

పీఎఫ్ఐకు సంబంధించిన కార్యాలయాలపై దాడులు చేసినప్పుడు ఉగ్రవాద సాహిత్యంతో పాటు మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నది. మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు ఎన్ఐఏ తెలిపింది. దేశవ్యాప్తంగా జరిపిన పలు సోదాల అనంతర పలువురిని విచారించామని, పీఎఫ్ఐ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేసింది. కాగా, పీఎఫ్ఐ సంస్థను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిషేధించింది.

ఎన్ఐఏ దాఖలు చేసిన చార్జి షీటులో అబ్దుల్ ఖాదర్ (నిజామాబాద్), అబ్దుల్ అహద్ (నిజామాబాద్), షేక్ ఇలియాస్ అహ్మద్ (నెల్లూరు), అబ్దుల్ సలీమ్ (జగిత్యాల), ఫిరోజ్ ఖాన్ (అదిలాబాద్), షేక్ షాదుల్లా (నిజామాబాద్), మహ్మద్ ఉస్మాన్ (జగిత్యాల), సయ్యద్ యహియా సమీర్ (నిజామాబాద్), షేక్ ఇమ్రాన్ అలియాస్ ఇమ్రాన్ ఖురేషి (నిజామాబాద్), మహ్మద్ అబ్దుల్ ముబీన్ (నిజామాబాద్), మహ్మద్ ఇర్ఫాన్ (కరీంనగర్) లను నిందితులుగా పేర్కొన్నది.

First Published:  30 Dec 2022 4:45 PM IST
Next Story