ఆర్జీకర్ మృతురాలి తల్లిదండ్రుల పిటిషన్ కొట్టివేత
ఈ కేసులో మళ్లీ సీబీఐ విచారణ జరిపించాలని మృతురాలి తల్లిదండ్రులు వేసిన పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

ఆర్జీకర్ హాస్పిటల్ డాక్టర్‌పై గత ఏడాది జరిగిన హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఈ కేసులో మళ్లీ సీబీఐ విచారణ జరిపించాలని మృతురాలి తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఉన్నత న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. కోల్‌కతా హైకోర్టులో ఈ పిటిషన్‌ను కొనసాగించొచ్చని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా సూచించారు.
గత ఏడాది ఆగస్టు 9న ఆర్జీకర్ హాస్పిటల్ సెమినార్ రూమ్‌లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి హాస్పిటల్ ఆవరణలో సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడిని దోషిగా తేల్చింది. శిక్ష ఖరారు చేయడానికి ముందు.. తాను ఏ నేరం చేయలేదని ఏ కారణం లేకుండానే తనను ఇందులో ఇరికించారని సంజయ్ తన వాదనలు వినిపించాడు. కాగా ఈ కేసులో కోర్టు అతడకి జీవిత ఖైదును విధిస్తూ తీర్పు వెలువరించింది.
ఇదిలా ఉంటే.. సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు విధించిన ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోల్‌కతా హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. ప్రభుత్వం చేసిన ఈ ప్రత్యేక అప్పీల్‌ను స్వీకరించడానికి హైకోర్టు నిరాకరించింది. అయితే ఇదే తీర్పును సవాల్ చేస్తూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాఖలు చేసిన అప్పీల్‌ను న్యాయస్థానం అంగీకరించింది. మరోవైపు.. కేసు పునర్విచారణ కోరుతూ మృతురాలి తల్లిదండ్రులు వేసిన పిటిషన్ అత్యవసర విచారణకు ఇప్పటికే నిరాకరించిన సుప్రీంకోర్టు తాజాగా హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.