Telugu Global
CRIME

ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌ లో రెస్క్యూ ఆపరేషన్‌ పరిశీలించిన కేంద్ర కార్యదర్శి

సహాయక చర్యలను వివరించిన డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషల్‌ సీఎస్‌

ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌ లో రెస్క్యూ ఆపరేషన్‌ పరిశీలించిన కేంద్ర కార్యదర్శి
X

ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌లో జరుగుతోన్న రెస్క్యూ ఆపరేషన్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ సెక్రటరీ కల్నల్‌ కీర్తిప్రతాప్‌ సింగ్‌ గురువారం పరిశీలించారు. ఫిబ్రవరి 22న టన్నెల్‌లో టీబీఎం సాయంతో పని చేస్తుండగా పైకప్పు కూలిపడింది. 13 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర కార్యదర్శి టన్నెల్‌ ను సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. తెలంగాణ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ స్పెషల్‌ సీఎస్‌ అర్వింద్‌ కుమార్‌ టన్నెల్‌లో చేపట్టిన సహాయక చర్యలను కేంద్ర కార్యదర్శికి వివరించారు. టన్నెల్‌ లోపల 13.65 కి.మీ.ల ప్రాంతంలో టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ పై రాళ్లు, మట్టి పడి 150 మీటర్ల పొడవున టీబీఎం పూర్తిగా ధ్వంసం అయ్యిందని వివరించారు. ఈ ప్రమాదంలో 8 మంది అందులోనే చిక్కుకుపోయారని తెలిపారు. టీబీఎంను కొద్దికొద్దిగా కట్‌ చేస్తూ రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నామని చెప్పారు. సీపేజీ ఎక్కువగా ఉండటం, బురద, మట్టి, రాళ్లు కలిసిపోవడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు. టన్నెల్‌లో చిక్కుకుపోయిన కార్మికుల జాడ కనిపెట్టేందుకు కేరళ నుంచి క్యాడవర్‌ డాగ్స్‌ రప్పించామన్నారు. కన్వేయర్‌ బెల్ట్‌ పునరుద్దరించామని తెలిపారు. టన్నెల్‌ లో పేరుకుపోయిన మట్టిని బెల్ట్‌ ద్వారా బయటికి తీస్తున్నామని చెప్పారు. వారి వెంట నాగర్‌ కర్నూల్‌ కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఎస్పీ రఘునాథ్‌, డోగ్రా రెజిమెంట్‌ కమాండెంట్‌ పరిక్షిత్‌ మెహ్రా, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కమాండెంట్‌ ప్రసన్న, జేపీ అసోసియేట్స్‌ ఎండీ పంకజ్‌ గౌరి తదితరులు ఉన్నారు.

First Published:  6 March 2025 6:35 PM IST
Next Story