కన్నకూతురిపైనే ఘాతుకం.. చచ్చేవరకూ జైల్లోనే ఉండాలంటూ కోర్టు తీర్పు
కుమార్తెకు 2021 జూలై వాంతులు అవుతుండటంతో తల్లి నాంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యులు నాలుగు నెలల గర్భంతో ఉందని తేల్చారు.
కామంతో కళ్లు మూసుకుపోతున్న పలువురు వావివరుసలు మరిచిపోతున్నారు. పశువుల్లా వ్యవహరిస్తున్నారు. తమ బిడ్డలకు రక్షణగా ఉండాల్సినవారే కన్నబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అలాంటి ఓ తండ్రికి తాజాగా నాంపల్లి కోర్టు మరణించేవరకు జైల్లోనే ఉండాలంటూ శిక్ష విధించింది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ కుటుంబం కొంత కాలం క్రితం బతుకు తెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చేసింది. ఫిలిం నగర్‌లో నివాసం ఉంటూ.. భర్త వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. భార్య స్థానికంగా పలు ఇళ్లలో పనిచేస్తోంది. వారికి 14 ఏళ్ల కుమార్తె, మరో కుమారుడు ఉన్నారు. కుమారుడు తూర్పుగోదావరి జిల్లాలోనే హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నాడు. కుమార్తె తల్లిదండ్రులతోనే ఉంటోంది.
కుమార్తెకు 2021 జూలై వాంతులు అవుతుండటంతో తల్లి నాంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యులు నాలుగు నెలల గర్భంతో ఉందని తేల్చారు. దీంతో తల్లి కుమార్తెను నిలదీయగా.. తల్లి పనికి వెళ్లిన సమయాల్లో తండ్రే ఈ ఘాతుకాలకు పాల్పడ్డాడని వివరించింది. భోజనంలో నిద్ర మాత్రలు కలిపి.. తాను నిద్రపోయిన తర్వాత లైంగిక దాడికి పాల్పడేవాడని తెలిపింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని వివరించింది.
తన దుర్మార్గాలు బయటపడటంతో తండ్రి ఇంటినుంచి పరారయ్యాడు. తల్లి ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు తండ్రిని అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి ఈ కేసులో శుక్రవారం తీర్పు వెలువరించారు. నిందితుడు మరణించే వరకు జైలులోనే ఉండాలంటూ శిక్ష విధించారు. మెట్రో లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా బాలికకు రూ.7 లక్షల సాయం అందించాలని ఆదేశించారు.