Telugu Global
CRIME

సొంత ప్రియురాలిని ఎరగా వేసి యువకుడి హత్య

తన సోదరుడి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్న శ్రీనివాసులు.. నలుగురు వ్యక్తులకు 5 లక్షలు సుపారీ ఇచ్చాడు. కిరాయి హంతక ముఠా ఒక అమ్మాయిని ఎరగా వేసి రమేష్‌ను ఊరి బయట ఉన్న మామిడితోటలోకి రప్పించి అక్కడే హత్య చేసింది.

సొంత ప్రియురాలిని ఎరగా వేసి యువకుడి హత్య
X

తన భర్తను చంపినవారి చావుచూసే వరకు తాళి, గాజులు తీయబోనని శపథం చేసిన ఒక మహిళ అనుకున్నది సాధించింది. ఈ ప్రయత్నంలో ఆమె మరిది హంతకుడిగా మిగిలిపోయాడు. మదనపల్లిలో ఈ ఘటన జరిగింది.

అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలం గుండ్లబురుజుకు చెందిన వెంకటరమణ గతంలో హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో జంగిటి రమేష్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. తన భర్తను హత్య చేసిన వారి చావు చూసే వరకు తాను తాళి, గాజులు తీయబోనని మృతుడు వెంకటరమణ భార్య రోజా శపథం చేశారు. దాంతో ఆమె మరిది, వెంకటరమణ సోదరుడు శ్రీనివాసులు.. జంగిటి రమేష్ హత్యకు పథక రచన చేశాడు.

తన సోదరుడి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్న శ్రీనివాసులు.. నలుగురు వ్యక్తులకు 5 లక్షలు సుపారీ ఇచ్చాడు. కిరాయి హంతక ముఠా ఒక అమ్మాయిని ఎరగా వేసి రమేష్‌ను ఊరి బయట ఉన్న మామిడితోటలోకి రప్పించి అక్కడే హత్య చేసింది. రమేష్‌కు ఇంకా పెళ్లి కాకపోవడం, చెడు అలవాట్లు ఉండడం గుర్తించిన కిరాయి ముఠా ఆ అవకాశాన్ని వాడుకుంది.

కిరాయి ముఠాలోని ఒక వ్యక్తికి ప్రియురాలు ఉంది. ఆమెనే రమేష్‌కు ఎరగా వేశారు. రమేష్‌కు ఫోన్‌ చేసి కవ్వించిన సదరు యువతి.. అతడిని మామిడితోటలోకి రప్పించింది. ఆ యువతితో రమేష్ సన్నిహితంగా ఉన్న సమయంలోనే హంతకముఠా దాడి చేసింది. కత్తులతో దారుణంగా నరికారు. అనంతరం తల వేరు చేసి తీసుకెళ్లారు. ఉదయం స్థానికులు తల లేని మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు హతుడు రమేష్ గతాన్ని పరిశీలించి వెంకటరమణ హత్యకు ప్రతీకారంగానే ఇది జరిగిందని నిర్ధారణకు వచ్చారు. వెంకటరమణ సోదరుడు శ్రీనివాసులు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసింది తామేనని అంగీకరించాడు. ఈ కేసులో నలుగురు వ్యక్తులతో పాటు.. ఇద్దరు అమ్మాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు.

తన భర్తను చంపిన వారి చావు చూసే వరకు తాళి, గాజులు తీయబోనన్న వెంకటరమణ భార్య రోజా శపథం అయితే నేరవేరింది. కానీ ఆమె మరిది హంతకుడిగా మారిపోయాడు. అతడి జీవితం ఇక జైలు పాలే. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే దాని పర్యవసానాలు ఇబ్బందిగానే ఉంటాయి.

First Published:  29 Dec 2022 8:35 AM IST
Next Story