ఉప్పల్ జంట హత్యల గుట్టు వీడింది.. 'పూజ' చేసినా పోలీస్ జాబ్ రాలేదనే హత్య
ఎస్ఐ ఉద్యోగం రావాలని పూజలు చేయాలని కోరడంతో.. పూజారి రూ. 6 లక్షలు తీసుకొని పూజలు చేశాడు. అంతే కాకుండా ఉద్యోగం కోసం కిస్మత్‌పురాకు చెందిన ఇద్దరు మధ్యవర్తులకు రూ. 12.50 లక్షలు చెల్లించాడు.
హైదరాబాద్ పరిధి ఉప్పల్‌లో జరిగిన తండ్రికొడుకుల జంట హత్యల కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు. పూజలు చేసి, డబ్బులు ఇచ్చినా తనకు ఎస్ఐ ఉద్యోగం రాలేదనే కోపంతో కక్ష పెంచుకొని పూజారిని హత్య చేశారని, ఆ సమయంలో అడ్డొచ్చిన అతడి కుమారుడిని కూడా మట్టుబెట్టారని పోలీసులు వెల్లడించారు. జంట హత్యల కేసులో మొత్తం ఐదుగురిని అరెస్టు చేశారు. మరో ముగ్గురిని ఇంకా విచారిస్తున్నారు. ఈ హత్యలకు సంబంధించిన వివరాలను మల్కాజిగిరి, ఉప్పల్ పోలీసులతో కలిసి రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ వెల్లడించారు.
ఉప్పల్‌కు చెందిన పూజారి నరసింహ మూర్తి (75) ఇంటి వద్దనే ఉంటూ పూజలు చేస్తుంటారు. జాతకం చెప్పడంతో పాటు ఇళ్ల వద్ద జరిగే పూజా కార్యక్రమాలకు కూడా అప్పడప్పుడు వెళ్తుంటారు. ఉప్పల్‌కు చెందిన వినయ్ (31) అనే యువకుడు తన మేనమామతో కలిసి తరచూ నరసింహ మూర్తి ఇంటికి పూజల కోసం వెళ్తుండేవాడు. దీంతో వినయ్‌కు పూజలపై విపరీతమైన నమ్మకం ఏర్పడింది. పోలీస్ శాఖలో ఉద్యోగం చేయాలనే ఆశ ఉన్న వినయ్ 2016లో ఎస్ఐ జాబ్ కోసం పరీక్షలకు హాజరయ్యాడు.
తనకు ఎస్ఐ ఉద్యోగం రావడానికి పూజలు చేయాలని కోరడంతో.. పూజారి రూ. 6 లక్షలు తీసుకొని పూజలు చేశాడు. అంతే కాకుండా ఉద్యోగం కోసం కిస్మత్‌పురాకు చెందిన ఇద్దరు మధ్యవర్తులకు రూ. 12.50 లక్షలు చెల్లించాడు. ఎన్నాళ్లు గడిచినా ఉద్యోగం రాకపోవడంతో వినయ్ డబ్బుల కోసం పూజారితో పాటు మధ్యవర్తులను ఒత్తిడి చేశాడు. పూజరి డబ్బులు ఇవ్వలేదు. కానీ మధ్యవర్తులు డబ్బులు ఇచ్చేలా పూజలు చేస్తానంటూ మరో రూ. 40 వేలు తీసుకున్నాడు. కొన్నాళ్లకు మధ్యవర్తులు రూ. 10 లక్షలు తిరిగి ఇచ్చారు. మరో రూ. 2.50 లక్షలకు చెక్కు రాసి ఇచ్చారు.
ఇక వినయ్ ఒక స్నేహితుడి వ్యాపారంలో రూ. 13.50 లక్షలు పెట్టుబడి పెట్టాడు. దీంతో కుంగిపోయి మరోసారి పూజారి వద్దకు వచ్చాడు. తాను పెట్టిన పెట్టుబడి తిరిగి రావడం లేదని, జీవితంలో కూడా స్థిరపడలేక పోతున్నానని పూజారికి మొరపెట్టుకున్నాడు. దీంతో మరోసారి పూజారి పూజలు చేసి డబ్బులు తీసుకున్నాడు. అయినా అతడి పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ సారి పూజారి విదేశాలకు వెళ్తే ప్రయోజనం ఉంటుందని పూజ చేసి డబ్బు గుంజాడు. హైయ్యర్ స్టడీస్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన వినయ్.. కరోనా సమయంలో తిరిగి వచ్చాడు.
ఒకవైపు ఉద్యోగం రాకపోవడం, విదేశాలకు వెళ్లినా ప్రయోజనం లేకపోడంతో పాటు.. కొన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు వెంటాడటంతో వినయ్ వేరే పూజారులను కలిశాడు. ప్రతీ పౌర్ణమి రోజు తాను అనారోగ్యానికి గురవుతున్నానని వారికి చెప్పాడు. అయితే.. క్షుద్ర పూజల కారణంగానే ఇలా జరుగుతుందని చెప్పడంతో వినయ్‌కి నరసింహ మూర్తిపైన అనుమానం వచ్చింది. తన దగ్గర ఎస్ఐ ఉద్యోగం కోసం తీసుకున్న రూ. 6 లక్షలు తిరిగి ఇవ్వాల్సి వస్తుందనే క్షద్రపూజలు చేయిస్తున్నాడని నమ్మిన వినయ్.. పూజారి హత్యకు ప్లాన్ చేశాడు.
పూజారి నరసింహమూర్తిని హత్య చేయాలని నిర్ణయించుకున్న వినయ్.. అతడి స్నేహితులు బాలకృష్ణ (33), లాల్ జగదీశ్ గౌడ్ (36)లను సంప్రదించారు. జగదీశ్ గౌడ్ తన స్నేహితులైన రామ్ (56), శ్యామ్ సుందర్‌లను పరిచయం చేశాడు. ఉప్పల్‌లోని నరసింహ మూర్తి ఇంటికి ఎదురుగా ఉన్న హాస్టల్‌లో రామ్‌ను ఉంచారు. పూజారి కదలికలపై తమకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని అతడికి చెప్పారు. అయితే, పూజారిని హత్య చేయడానికే తనను వాడుకుంటున్నారని గ్రహించిన రామ్ హాస్టల్ నుంచి పారిపోయాడు. దీంతో శ్యామ్‌ను అక్కడ పెట్టారు. అతడు ఇచ్చిన సమాచారంతో ఈ నెల 14న ఇంటి వద్దకు చేరుకున్నారు.
ఆ రోజు ఉదయం నరసింహ మూర్తి బయటకు వచ్చి కూర్చున్నాడు. పని మనిషి వచ్చి గేటు తీసి లోపలికి వెళ్లిన వెంటనే వినయ్, బాలకృష్ణలు ముసుగులు ధరించి లోపలకు వచ్చారు. వినయ్ కొడవలితో పూజారిపై వేటు వేశాడు. అతడి అరుపులకు లోపల ఉన్న కుమారుడు శ్రీనివాస్ బయటకు రావడంతో.. అతడి ఛాతిపై బాలకృష్ణ కత్తితో పొడిచాడు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. వాసిగడ్డి కార్తీక్ (22), సుధాకర్ రెడ్డి (32)ల సహాయంతో నిందితులు ఇద్దరూ కడపజిల్లా ఒటిమిట్టకు పారిపోయారు. అక్కడి నుంచి విశాఖపట్నం వెళ్లారు. నిందితుల సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వారి ఆచూకీ కనిపెట్టినట్లు పోలీసులు చెప్పారు. కాగా, కొడుకు హత్య చేసి వచ్చిన తర్వాత రక్తంతో తడిసిన అతడి చొక్కాను వినయ్ తల్లి సావిత్రి శుభ్రం చేసిందని.. ఆమెను కూడా నిందితురాలిగా చేర్చినట్లు పోలీసులు పేర్కొన్నారు.