వైశాలి తండ్రి పేరు మీద రెండు కేఫేలను రిజిస్ట్రేషన్ చేసిన కిడ్నాపర్ నవీన్ రెడ్డి?
నవీన్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు బాధితురాలు తల్లిదండ్రులు, బంధువులు పోలీసులకు వేర్వేరు రకాలుగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా వెల్లడవుతున్న పలు విషయాలు పోలీసులను కన్ఫ్యూజ్ చేస్తున్నట్లు తెలుస్తున్నది.
హైదరాబాద్ శివారులో పెళ్లి కూతురు వైశాలి కిడ్నాప్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కిడ్నాప్ జరిగిన గంటల వ్యవధిలోనే రాచకొండ పోలీసులు బాధితురాలైన డెంటల్ డాక్టర్ వైశాలిని రక్షించారు. అంతే కాకుండా శనివారం జరిగిన పరీక్షకు కూడా ఆమె హాజరైనట్లు పోలీసులు తెలిపారు. కిడ్నాప్‌కు వ్యూహం రచించిన ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి పోలీసుల అదుపులోనే ఉన్నా.. అధికారికంగా ప్రకటించలేదు. అయితే, కిడ్నాప్ చేయడానికి వచ్చినప్పుడు జరిగిన విధ్వంసంలో పాల్గొన్న వారిలో 31 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు.
కాగా, ఈ కేసులో నవీన్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు బాధితురాలు తల్లిదండ్రులు, బంధువులు పోలీసులకు వేర్వేరు రకాలుగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా వెల్లడవుతున్న పలు విషయాలు పోలీసులను కన్ఫ్యూజ్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. 2021లోనే వైశాలితో తనకు పెళ్లి జరిగినట్లు గతంలో నవీన్ కోర్టులో వెల్లడించారు. బాపట్ల జిల్లా వలపర్లలోని ఓ ఆలయంలో పెళ్లి జరిగిందని.. అయితే వైశాలి బీడీఎస్ కోర్సు పూర్తయ్యే వరకు ఈ విషయం బయటకు చెప్పొదని వాళ్ల తల్లిదండ్రులు సూచించినట్లు వెల్లడించారు.
వైశాలి తండ్రి దామోదర్‌రెడ్డి అప్పడప్పుడు నవీన్ దగ్గర డబ్బులు తీసుకునే వాడని కూడా తెలుస్తున్నది. దామోదర్ రెడ్డి పేరుతో రెండు కాఫీ షాపులతో పాటు ఒక ఖరీదైన వోల్వో కారు కూడా రిజిస్ట్రేషన్ చేసినట్లు గతంలోనే నవీన్ కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో చెప్పాడు. తాజాగా పోలీసులకు అదే విషయం వెల్లడించాడు. నవీన్ తల్లి నారాయణమ్మ కూడా ఈ విషయాలను ధృవీకరించింది. గతంలోనే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు తన కొడుకు చెప్పాడని అన్నది. రెండేళ్లుగా ఇద్దరు సన్నిహితంగా ఉంటున్నట్లు కూడా వెల్లడించింది. నవీన్ రెడ్డి వ్యాపారంలో సంపాదించిన దాంట్లో చాలా వరకు యువతి తండ్రికి ఇచ్చాడని పేర్కొంది.
వైశాలి కుటుంబ సభ్యులను తన సొంత డబ్బుతో అరకు, మంగళూరు, గోవా వంటి పర్యాటక ప్రదేశాలకు పంపినట్లు కూడా తెలుస్తున్నది. అయితే తన కొడుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని తాము ఊహించలేదని తల్లి నారాయణమ్మ చెప్పుకొచ్చింది. తన కొడుకు చేసింది తప్పే. అయితే గతంలో జరిగిన పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని పోలీసులను విన్నవించింది. కాగా, వైశాలి కుటుంబం మాత్రం వేరే రకమైన స్టేట్మెంట్లు ఇచ్చింది. అతడితో మొదట్లో సన్నిహితంగా ఉన్న మాట వాస్తవమే అయినా.. అతడి ప్రవర్తన నచ్చక దూరం పెట్టామని అంటున్నారు. అందుకే వైశాలికి వేరే సంబంధం చూశామన్నారు.
కానీ, నవీన్ రెడ్డి మాత్రం మా ఇంటి సమీపంలో చాయ్ స్టాల్ పెట్టి.. వైశాలి ఎప్పుడు బయటకు వచ్చినా వేధింపులకు పాల్పడే వాడని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఇరు వర్గాలు చేసుకుంటున్న ఆరోపణలు కూడా నమోదు చేసి.. వాటి వెనుక ఉన్న నిజానిజాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు.