మంత్రి సబితా ఇంద్రారెడ్డి సెక్యూరిటీ అధికారి గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య
ఆదివారం ఉదయం శ్రీనగర్ కాలనీలోని మణికంఠ హోటల్ వద్దకు కూతురితో వచ్చిన ఆయన.. గన్‌తో కాల్చుకొని చనిపోయాడు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి సెక్యూరిటీ ఆఫీసర్‌గా పని చేస్తున్న ఏఎస్ఐ స్థాయి అధికారి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కూతురి కళ్లెదుటే పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో గన్‌తో కాల్పుకొని చనిపోవడం దిగ్భ్రాంతికి గురి చేసింది. మంత్రి సబిత ఇంద్రారెడ్డి బంజారాహిల్స్‌లో నివాసం ఉంటారు. మంత్రి దగ్గర ఏఎస్ఐ ఫజల్ అలీ ఎస్కార్ట్ అధికారిగా పని చేస్తున్నారు. ఆదివారం ఉదయం శ్రీనగర్ కాలనీలోని మణికంఠ హోటల్ వద్దకు కూతురితో వచ్చిన ఆయన.. గన్‌తో కాల్చుకొని చనిపోయాడు.
అక్కడే అతని కూతురు కూడా ఉంది. ఈ సంఘటన ప్రత్యక్షంగా చూసి షాక్‌కు గురయ్యింది. స్థానికుల విచారణలో అతను మంత్రి సబిత సెక్యూరిటీ అధికారిగా గుర్తించి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసు అధికారులను అడిగి విషయం తెలుసుకున్నారు.
మృతుడు ఫజల్‌కి ఆర్థిక సమస్యలు ఉన్నట్లు తెలిసింది. గతంలో ఒక లోన్ యాప్ నుంచి అప్పు తీసుకున్నాడు. దానికి సంబంధించి రూ.3 లక్షలు చెల్లించినా.. మరో రూ.10 లక్షలు చెల్లించాలని వేధింపులకు గురి చేశారు. లోన్ చెల్లించే మార్గాలు లేకపోవడంతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, లోన్‌కు సంబంధించిన పత్రాలు అన్నీ తన కూతురు చేతిలో పెట్టి.. ఫజల్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఈ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.