Telugu Global
CRIME

ఎంఐఎం కార్పొరేటర్ మేనల్లుడి హత్య వెనక కారణమేంటి? పోలీసుల అదుపులో నిందితులు?

ఈదిబజార్ పరిధిలోని అక్బర్‌నగర్ ప్రాంతానికి చెందిన ముర్తూజా.. అన్వర్ ఉలూమ్ డిగ్రీ కాలేజీలో చదువుతున్నాడు.

ఎంఐఎం కార్పొరేటర్ మేనల్లుడి హత్య వెనక కారణమేంటి? పోలీసుల అదుపులో నిందితులు?
X

ఎంఐఎం కార్పొరేటర్ మహ్మద్ అలీ షరీఫ్ మేనల్లుడు సోమవారం దారుణ హత్యకు గురయ్యారు. మామయ్యను కలవడానికి లలిత్‌బాగ్‌లోని ఆయన ఆఫీసుకు వచ్చిన మేనల్లుడు సయ్యద్ ముర్తూజా అలీ అనాస్ (22)ను గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేసి చంపేశారు. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు కార్యాలయంలోని ఎంట్రన్స్ వద్ద నిలుచున్న ముర్తూజా అలీని.. అక్కడకు వచ్చిన ఇద్దరు పదునైన ఆయుధంతో గొంతు కోసి హత్య చేసి పారిపోయారు.

ముర్తూజాపై దాడి జరిగిన వెంటనే కార్యాలయంలోని ఎంఐఎం కార్యకర్తలు అతడిని కంచన్‌బాగ్‌లోని ఓవైసీ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ముర్తూజా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం పోస్టు మార్టం కోసం బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈదిబజార్ పరిధిలోని అక్బర్‌నగర్ ప్రాంతానికి చెందిన ముర్తూజా.. అన్వర్ ఉలూమ్ డిగ్రీ కాలేజీలో చదువుతున్నాడు. కార్పొరేటర్ సోదరి కొడుకైన ముర్తూజా అప్పడప్పుడు మామయ్య కార్యాలయానికి వస్తుంటాడు. అయితే హత్యకు గల కారణాలను మాత్రం కుటుంబ సభ్యులు వెల్లడించడం లేదు.

వ్యక్తిగత కక్షలతోనే ముర్తూజా హత్య జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. క్రైం జరిగిన ప్రదేశానికి చేరుకున్న భవానీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ కూడా అక్కడకు చేరుకొని ఆధారాలు సేకరించింది. నిందితులు ఉపయోగించిన పదునైన కత్తిని అక్కడ నుంచి రికవరీ చేశారు. హత్యకు పాల్పడిన ఇద్దరు అనుమానితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తున్నది. కానీ, ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు.

హత్య ఉదంతంపై ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఈ హత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని సంతోశ్ నగర్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. కాగా, లలిత్ బాగ్, ఈది బజార్ ప్రాంతంలో హత్య అనంతరం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉండటంతో ప్రత్యేక పెట్రోలింగ్ ఏర్పాటు చేసినట్లు సౌత్ జోన్ డీసీపీ పి. సాయి చైతన్య తెలిపారు.

First Published:  20 Dec 2022 9:13 AM IST
Next Story