ప్రియురాలి ఇంటికి పార్సిల్ బాంబు.. అది పేలి తండ్రి, కుమార్తె దుర్మరణం
టేపు రికార్డర్ ప్లగ్ ను కరెంటు సాకెట్ లో పెట్టి స్విచ్ ఆన్ చేయగానే ఒక్కసారిగా అది పేలింది. ఈ పేలుడులో జీతూ భాయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. భూమిక తీవ్రంగా గాయపడగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
గుజరాత్ రాష్ట్రం వడాలిలో ప్రియురాలి ఇంటికి ఆమె ప్రియుడు పార్సిల్ బాంబు పంపగా.. అది పేలి ఆమె భర్త, కుమార్తె మృతి చెందారు. మరో ఇద్దరు కుమార్తెలు తీవ్రంగా గాయపడ్డారు. వడాలిలో కూలి పనులు చేసుకునే జీతూ భాయ్ హిరా భాయ్ వంజారా (32)కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కాగా, జీతూ భాయ్ ఇంటికి టేప్ రికార్డర్ పోలిన ఓ వస్తువు పార్సిల్ లో వచ్చింది. ఆ పార్సిల్ విప్పిన జీతూ భాయ్, అతడి పెద్ద కుమార్తె భూమిక(12) దానిని ఆన్ చేయడానికి ప్రయత్నించారు.
టేపు రికార్డర్ ప్లగ్ ను కరెంటు సాకెట్ లో పెట్టి స్విచ్ ఆన్ చేయగానే ఒక్కసారిగా అది పేలింది. ఈ పేలుడులో జీతూ భాయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. భూమిక తీవ్రంగా గాయపడగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ పేలుడులో జీతూ భాయ్ 9,10 ఏళ్ల వయసున్న మరో ఇద్దరు కుమార్తెలు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలో నమోదైన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేశారు. ఓ ఆటో డ్రైవర్ జీతూ భాయ్ ఇంట్లో పార్సిల్ ను అందజేసినట్లు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు.
అతడిచ్చిన సమాచారం ఆధారంగా నిందితుడైన జయంతి భాయ్ బాలు సింగ్ వంజారా(31)ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అతడిని ప్రశ్నించగా తన ప్రియురాలిని జీతుభాయ్ వివాహం చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో అతడిని చంపేందుకు కుట్ర పన్నినట్లు అంగీకరించాడు. కాగా, పార్సిల్ బాంబు పేలిన సమయంలో జీతూ భాయ్ ఇంట్లో అందరూ ఇంట్లోనే ఉండగా.. అతడి భార్య మాత్రం ఇంట్లో లేదు. దీంతో పార్సిల్ బాంబు కుట్రలో ఆమె ప్రమేయం కూడా ఉండొచ్చనే అనుమానంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.