Telugu Global
CRIME

తల్లికి నిప్పంటించి.. వీడియో తీసి..

భూవివాదాల నేపథ్యంలో తల్లి, కొడుకు మధ్య పంచాయితీ మొదలైంది. కొడుకు గౌరవ్‌పై పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది.

తల్లికి నిప్పంటించి.. వీడియో తీసి..
X

రోజురోజుకు మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. కన్నతల్లికే నిప్పంటించాడు ఓ కిరాత‌కుడు. మంటలకు తాళలేక ఆమె ఆర్తనాదాలు పెడుతుంటే.. దాన్ని ఫోన్‌లో వీడియో తీసి రాక్షసానందం పొందాడు. ఈ దారుణమైన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌లో జరిగింది.

భూవివాదాల నేపథ్యంలో తల్లి, కొడుకు మధ్య పంచాయితీ మొదలైంది. కొడుకు గౌరవ్‌పై పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ క్రమంలో పోలీస్‌ స్టేషన్ ప్రాంగణంలోనే ఇరువురు తమ వారితో కలిసి వివాదాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేశారు. ఎంతకీ తేలకపోవటంతో తల్లి ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఆమె చేతిలో ఉన్న లైటర్‌ను లాక్కునే ప్రయత్నం చేశారు. అది కింద పడిపోయింది. ఈలోపే పక్కనే ఉన్న కొడుకు గౌరవ్‌ తల్లికి నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో పోలీసులు దూరం జరిగారు. మట్టి, గోనె సంచులతో మంటల్ని ఆర్పారు. వెంటనే ఆస్ప‌త్రికి తరలించినప్పటికీ.. శరీరం సగం కాలిపోవడంతో చికిత్స పొందుతూ మహిళ చనిపోయింది. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గౌరవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కన్నతల్లికే కొడుకు నిప్పంటించిన ఈ ఘటన అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

First Published:  17 July 2024 11:09 AM IST
Next Story