Telugu Global
CRIME

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. నిందితుడికి ఐదు గుంజీల శిక్ష వేసిన గ్రామ పెద్దలు

నిందితుడు అగ్రకులానికి చెందిన వ్యక్తి అవడం వల్లే ఇలా పంచాయితీ పెద్దలు జరిగిన ఘటన బయట పడకుండా జాగ్రత్త పడ్డారనే విమర్శలు వెల్లువెత్తాయి.

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. నిందితుడికి ఐదు గుంజీల శిక్ష వేసిన గ్రామ పెద్దలు
X

అభం శుభం ఎరుగని ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేయడమే ఒక అమానవీయ ఘటన అయితే.. ఆ ఘటనకు పాల్పడిన నిందితుడికి కేవలం ఐదు గుంజీల శిక్ష వేసి సభ్య సమాజం తలదించుకునేలా చేశారు ఓ గ్రామ పెద్దలు. అత్యంత దారుణమైన ఈ సంఘటన బీహార్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని నవాడా జిల్లా అక్బర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో అరుణ్ పండిట్ అనే వ్యక్తి పౌల్ట్రీ ఫామ్‌లో పని చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఐదేళ్ల చిన్నారికి చాక్లెట్లు కొనిస్తానని చెప్పి పౌల్ట్రీ ఫామ్‌కు తీసుకొని వెళ్లాడు.

ఫామ్ వద్దకు వెళ్లిన తర్వాత ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో చిన్నారి ఏడుచుకుంటూ ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఆ చిన్నారి తల్లిదండ్రులు గ్రామ పెద్దలకు చెప్పారు. అయితే, గ్రామ పెద్దలు అనూహ్యంగా నిందితుడికి ఐదు గుంజీల శిక్ష మాత్రమే విధించారు. అక్కడ అత్యాచారం ఏమీ జరగలేదని.. ఆ చిన్నారి అబద్దం చెబుతుందని తేల్చిపారేశారు. ఇంతకు ఆ గుంజీల శిక్షైనా ఎందుకు వేశారంటే.. ఆ చిన్నారికి చాక్లెట్లు కొనిస్తానని అబద్దం చెప్పి పౌల్ట్రీ ఫామ్‌కు తీసుకొని వెళ్లినందుకు. కాగా, నిందితుడు పంచాయితీ చేసిన పెద్దల ముందే ఐదు గుంజీలు తీసి వెళ్లిపోయాడు. గుంజీలు తీస్తుండగా ఒకరు వీడియో తీసి.. జరిగిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

చిన్నారిపై అంతటి అఘాయిత్యం జరిగితే గుంజీలతో సరిపెడతారా? నిందితుడు అగ్రకులానికి చెందిన వ్యక్తి అవడం వల్లే ఇలా పంచాయితీ పెద్దలు జరిగిన ఘటన బయట పడకుండా జాగ్రత్త పడ్డారనే విమర్శలు వెల్లువెత్తాయి. కొంత మంది ఈ వీడియోను సీఎం నితీశ్ కుమార్, డిప్యుటీ సీఎం తేజశ్వి యాదవ్‌కు పంపించారు. రాష్ట్రంలో ఇలా అనధికార కోర్డులు పని చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని ఇలా వదిలేస్తారా? అని ప్రశ్నించారు. దీంతో వెంటనే నిందితుడిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ప్రభుత్వం ఆదేశించింది.

నవాడా జిల్లా ఎస్పీ గౌరవ్ మంగళ్ మాట్లాడుతూ.. ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని చెప్పారు. నిందితుడిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని, అలాగే ఈ ఘటన బయటకు రాకుండా ప్రయత్నించిన వారిని గుర్తించి వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని ఎస్పీ చెప్పారు.

First Published:  25 Nov 2022 10:02 AM IST
Next Story