ప్రేమించిన యువతిని చితక్కొట్టి.. ఆమెపై కారెక్కించిన యువకుడు
ప్రియా సింగ్‌కు గత 5 సంవత్సరాలుగా మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ గైక్వాడ్ కుమారుడు అశ్వజిత్ గైక్వాడ్‌తో పరిచయం ఉంది.
ప్రేమించిన అమ్మాయిపై ఓ ప్రభుత్వ ఉద్యోగి కొడుకు దారుణానికి ఒడిగట్టాడు. రహస్యంగా మాట్లాడాలని పిలిచి ప్రియారాలిపై దాడికి పాల్పడ్డాడు. తన గురించి తప్పుగా ప్రచారం చేసిందనే కోపంతో ఆమెపై కక్షపెంచుకున్న యువకుడు.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెను ఇష్టం వచ్చినట్లు కొట్టి ఆమెపైకి కారు ఎక్కించి గాయాలపాలు చేసిన దుర్ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది. ప్రియా సింగ్ అనే 26 ఏళ్ల యువతి తనపై జరిగిన దాడి గురించి ఇన్‌స్టాలో పెట్టిన పోస్టు కలకలం రేపింది.
ప్రియా సింగ్‌కు గత 5 సంవత్సరాలుగా మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ గైక్వాడ్ కుమారుడు అశ్వజిత్ గైక్వాడ్‌తో పరిచయం ఉంది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావటంతో కొంతకాలంగా కాస్త దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌కు రావాలంటూ ప్రియను అశ్వజిత్ ఆహ్వానించాడు. ఆ ఈవెంట్‌కు వెళ్లిన ఆమెపై ఫ్రెండ్స్‌తో కలిసి అతను దురుసుగా ప్రవర్తించాడు. ప్రైవేట్‌గా మాట్లాడాలని చెప్పి ఎవరూ లేని ప్రాంతంలోకి తీసుకెళ్లాడని, అసభ్యపదజాలంతో దూషిస్తూ తనపై దాడి చేశాడని ప్రియ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. తనపై అశ్వజిత్ చేయి చేసుకున్నాడని, గొంతును నొక్కే ప్రయత్నం చేశాడని, అతన్నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడంతో తనను కొట్టాడని, అతని స్నేహితుడు కూడా తనను కిందపడేశాడని ప్రియ తన పోస్టులో వివరించింది.
కారులో ఉన్న ఫోన్ తీసుకునేందుకు వెళ్తున్న సమయంలో.. మరోసారి డ్రైవర్‌తో కారును తనపై ఎక్కించినట్లు ప్రియ తన ఫిర్యాదులో పేర్కొన్నది. నొప్పులతోనే అరగంటకుపైగా రోడ్డుపై పడి ఉన్నానని, ఆ తర్వాత ఓ వ్యక్తి వచ్చి తనకు హెల్ప్ చేసినట్లు ఆమె వివరించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రియ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమెదు చేసుకుని విచారణ చేపట్టినట్లు ముంబై పోలీసులు తెలిపారు.