Telugu Global
CRIME

మణిపూర్‌, లక్షద్వీప్‌ కన్నా లగచర్ల ఘటన తక్కువేం కాదు

రాహుల్‌ గాంధీ.. మీ ముఖ్యమంత్రి అరాచకాలు ఆపు.. లగచర్ల బాధితులతో కలిసి కేటీఆర్‌

మణిపూర్‌, లక్షద్వీప్‌ కన్నా లగచర్ల ఘటన తక్కువేం కాదు
X

మణిపూర్‌, లక్షద్దీప్‌ కన్నా లగచర్ల ఘటన తక్కువేమి కాదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. సోమవారం ఢిల్లీలోని కానిస్టూషన్‌ క్లబ్‌ లో లగచర్ల బాధితులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో జరుగుతున్న అరాచకాలు, దమనకాండను నేషనల్‌ మీడియాలో చూపించాలన్నారు. లగచర్లలో మహిళలు, సామాన్యులపై పోలీసులు సాగించిన అకృత్యాలను బాధితులు వివరించగా కేటీఆర్‌ ట్రాన్స్‌లేట్‌ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగ పరిరక్షణ అంటూ రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని మాటలు చేపట్టం కాదు తెలంగాణలో వాళ్ల పార్టీ ముఖ్యమంత్రి అరాచకాలను ఆపాలని డిమాండ్‌ చేశారు. రాహుల్ గాంధీ చూస్తుంటే తనకు ఆశ్చర్యం వేస్తోందని ఆయన చెప్పేదొకటి, చేసేదొకటి.. ఆయనలో మరో మనిషి ఉన్నాడని అన్నారు. భూమి ఇచ్చే రైతులకు అన్యాయం జరగొద్దని వాళ్ల పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉన్నప్పుడే భూసేకరణ చట్టం తెచ్చారని గుర్తు చేశారు. లగచర్లలో ఒక్కో ఎకరం భూమి విలువ రూ.60 లక్షలు ఉంటే, రూ.8 లక్షలు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. దేశ వ్యాప్తంగా అదానీ గురించి మాట్లాడే రాహుల్‌ గాంధీ తెలంగాణలో అదానీ గురించి ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు. మణిపూర్‌ అంశంపై ఆయన స్పందిస్తారని.. ఆయనకు లగచర్ల బాధితుల కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ అంశంపై రాహుల్‌, ఖర్గే స్పందించాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం గిరిజన మహిళలపై చేసిన అఘాయిత్యాలను ఢిల్లీ వేదికగా దేశ ప్రజందరికీ తెలిసేలా చేసేందుకే ఇక్కడికి వచ్చామన్నారు. రైతులు, బీసీలు, దళితులు, గిరిజనుల సంక్షేమం గురించి పదే పదే మాట్లాడే రాహుల్ గాంధీ ఈ బాధితులను ఎందుకు పట్టించుకోవడం లేదో చెప్పాలన్నారు. 50, 60 ఏళ్లుగా ఆ భూమిపై ఆధారపడి బతుకున్నామని, తమ ప్రాణం పోయినా భూములు ఇవ్వమని వాళ్లు చెబుతున్నారని తెలిపారు. అర్ధరాత్రి పోలీసులు వాళ్ల ఇండ్లమీద లైంగిక దాడులు చేశారని, శారీరకంగా హింసించారని తెలిపారు. తమ బిడ్డలు ఎనిమిది రోజులుగా ఎక్కడున్నారో తెలియదని తల్లులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. రేవంత్‌ అన్న సహా కొందరు ప్రైవేట్ వ్యక్తులు తాగి వచ్చి తమను ఇష్టానుసారంగా తిట్టారని వాళ్లు చెప్తున్నారని వివరించారు. జ్యోతి అనే 9 నెలల గర్బిణీని తొక్కకుంటూ వెళ్లి ఆమె భర్తను తీవ్రంగా కొట్టి అరెస్టు చేశారని తెలిపారు. రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన అఘాయిత్యాలను మానవ హక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్ ను కలిసి వివరించారని తెలిపారు. భూములు ఇవ్వకుంటే అంతు చూస్తామని బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారని వివరించారు. రేవంత్‌ అల్లుడి కోసం పెట్టే ఫార్మా కంపెనీ కోసం గిరిజనులు భూములు కోల్పోవాలా అని ప్రశ్నించారు. పోలీసులు తాగి వచ్చి ఆడ పిల్లలపై అసభ్యంగా ప్రవర్తించారని, ఆడపిల్లలను కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని మండిపడ్డారు. తాము చావడానికైనా సిద్ధం కానీ భూములు ఇవ్వమని వాళ్లు చెప్తున్నారని వివరించారు. సీఎం అన్న తమను ఎలా బెదిరించారో బాధితులు చెప్తున్నది వినాలని విజ్ఞప్తి చేశారు.

మణిపూర్ లో హింస, యూపీ హాస్పిటల్ లో చిన్న పిల్లల మృతి, ముంబైలో ధారావి ప్రజల బాధను మీడియా ప్రజలకు చూపిస్తోందని, తెలంగాణలో గిరిజనులపై అంతకన్నా ఎక్కువ అరాచకాలు జరుగుతున్నాయని తెలిపారు. కేసీఆర్‌ పాలనలో తెలంగాణ పురోగతి సాధిస్తే ఈరోజు తెలంగాణలో అరాచకం నడుస్తోందన్నారు. సీఎం సోదరుడు వార్డ్‌ మెంబర్‌ కాకున్న ఆయనకు ప్రొటోకాల్‌ ఇస్తున్నారని, కలెక్టర్‌ వచ్చి స్వాగతం పలుకుతున్నాడని, పోలీసులు రేవంత్‌ రెడ్డి ప్రైవేట్‌ సైన్యంలా పని చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ చిన్న పిల్లలు పిలిచినా వస్తానని చెప్పిన రాహుల్‌ గాంధీకి గిరిజన మహిళల ఆక్రందనలు వినిపించడం లేదా అని ప్రశ్నించారు. ఆయన బిజీగా ఉంటే తామే వచ్చి కలుస్తామని బాధితులు కోరుతున్నారని, వాళ్లకు టైం ఇచ్చి వాళ్ల గోడు వినాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై పార్లమెంట్‌ లో బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు మాట్లాడాలని కోరారు. రాజ్యసభలో ఈ అంశాన్ని తమ పార్టీ సభ్యులు లేవనెత్తుతారని తెలిపారు. ఇన్నాళ్లు మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ బిజీగా ఉండొచ్చని.. ఇకనైనా ముఖ్యమంత్రిని పిలిపించి గిరిజనులపై అరాచకాలు ఆపాలని ఢిల్లీకి పిలిపించి హెచ్చరించాలని కోరారు. కాంగ్రెస్‌ కు తెలంగాణ ఏటీఎంలా మారిందని ప్రధాని మోదీ అంటారని.. కానీ ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. గిరిజనులపై పోలీసులు లైంగిక వేధింపులకు పాల్పడుతుంటే బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.

కొడంగల్‌ లో రైతులు తొమ్మిది నెలలుగా తమ భూములు ఇవ్వబోమని పోరాటం చేస్తున్నారని, 9 నెలల తర్వాత కలెక్టర్ వస్తే భూములు ఇవ్వమని నిరసన తెలిపారని చెప్పారు. దీనిని సాకుగా చూపుతూ 30 మంది రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని.. వాళ్లను సంగారెడ్డి జైల్లో కలిశానని.. నడవడానికి కూడా వాళ్లు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. కొట్టినట్టుగా జడ్జీ ముందు చెప్తే కుటుంబ సభ్యులపై కేసులు పెడతామని వాళ్లను బెదిరించారని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి మనసుంటే ఈ ఘటనపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ అఘాయిత్యాలను చట్టప్రకారం ప్రశ్నించిన తెలంగాణ డిజిటల్‌ మీడియా మాజీ డైరెక్టర్‌ కొణతం దిలీప్‌ ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు. సోషల్‌ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్టులు పెడితే భయమెందుకో చెప్పాలన్నారు. మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాను గుప్పిట్లో పెట్టుకున్నారని, సోషల్‌ మీడియాను నియంత్రించడానికి కేసులను అస్త్రంగా మలుచుకున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం రైతులను ఒప్పించి 14 వేల ఎకరాల భూమి సేకరించిందని తెలిపారు. తెలంగాణను రేవంత్‌ రెడ్డి ఫ్యామిలీ ప్యాకేజ్‌ గా మార్చేస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ రైట్‌ అంటే రేవంత్ రెడ్డి లెప్ట్ అనాలనే ఒకే ఒక్క పాలసీ పెట్టుకున్నారని, అందుకే ఫార్మాసిటీకి బదులుగా 20 ఫార్మా విలేజీలు అంటూ రాష్ట్రం మొత్తాన్ని కాలుష్యం కోరల్లోకి నెట్టాలని చూస్తున్నారని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు తప్ప ఒక్క హామీని కూడా కాంగ్రెస్‌ నెరవేర్చలేదన్నారు. తెలంగాణలో మహిళలకు రూ.2,500 ఇవ్వని కాంగ్రెస్‌ మహారాష్ట్రలో గెలిపిస్తే నెలకు రూ.3 వేలు ఇస్తామని తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. కేసీఆర్ కు మూఢ నమ్మకాలు ఎక్కువ అని గతంలో ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి వాస్తు పేరుతో సెక్రటేరియట్‌ లో మార్పులు చేస్తున్నారని తెలిపారు. ఢిల్లీకి మూటలు అందించే సత్తా ఉన్నది తెలంగాణలో ఒక్క రేవంత్‌ రెడ్డికేనని.. అందుకే ఆయనే ఐదేళ్లు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నామని చెప్పారు. రేవంత్‌ పాలన చూశాక బీఆర్‌ఎస్‌కు ప్రజలు 15 ఏళ్లు అధికారం ఇస్తారని అన్నారు.

First Published:  18 Nov 2024 7:27 PM IST
Next Story