కిడ్నీ రాకెట్‌లో కీలక నిందితుడి అరెస్ట్
కిడ్నీ రాకెట్‌లో సూత్రధారి రాంప్రసాద్ అని సిట్ అధికారులు గుర్తించారు. అతను కేరళలోని అలువాకు చెందిన మధుతో కలిసి ఈ దందా నడిపినట్లు తమ దర్యాప్తులో తేల్చారు.
కిడ్నీ రాకెట్ కేసులో కీలక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం రూరల్ జిల్లా ఎస్పీ వైభవ్ సక్సేనా నేతృత్వంలోని సిట్ బృందం హైదరాబాదులో నిందితుడు బల్లంకొండ రాంప్రసాద్ అలియాస్ ప్రసాద్ (41)ని అదుపులోకి తీసుకుంది. నిందితుడి స్వస్థలం విజయవాడ కాగా, అతను కొంతకాలంగా హైదరాబాదులో ఉంటున్నట్టు గుర్తించిన సిట్ బృందం కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్‌కు వచ్చి గాలింపు చేపట్టింది. హైదరాబాదులోని ఓ హోటల్‌లో తలదాచుకున్న రాంప్రసాద్‌ను పట్టుకున్న సిట్ బృందం అతన్ని కొచ్చికి తరలించి అక్కడి కోర్టులో హాజరుపరిచింది.
కిడ్నీ రాకెట్‌లో సూత్రధారి ఇతనే..
కిడ్నీ రాకెట్‌లో సూత్రధారి రాంప్రసాద్ అని సిట్ అధికారులు గుర్తించారు. అతను కేరళలోని అలువాకు చెందిన మధుతో కలిసి ఈ దందా నడిపినట్లు తమ దర్యాప్తులో తేల్చారు. మధు ఇరాన్‌లో స్థిరపడ్డాడని, అతని సూచనలకు అనుగుణంగా రాంప్రసాద్ కిడ్నీ దాతలను అక్కడికి పంపేవాడని సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది. రాంప్రసాద్ తనను తాను వైద్యుడిగా చెప్పుకొన్నప్పటికీ.. అతనికి వైద్యుడిగా అతడికి ఎలాంటి అనుభవం లేదని పోలీసుల దర్యాప్తులో స్పష్టమైంది. తన కోసం కేరళ పోలీసులు గాలిస్తున్నారనే విషయం పసిగట్టిన అతను.. విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలోనే చిక్కాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, ముంబయి, కేరళ, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి ఇప్పటివరకు 20 మందిని ఇరాన్‌కు తరలించినట్లు అనుమానిస్తున్న కేరళ పోలీసులు.. బాధితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. మధుపై లుక్‌అవుట్ నోటీస్ జారీ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. కేరళలో గత నెల 21న రాత్రి త్రిసూర్‌కు చెందిన కిడ్నీ రాకెట్ ముఠా సభ్యుడు సబిత్ నాజర్ అరెస్ట్ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.