Telugu Global
CRIME

కారు ఇవ్వలేదని పెళ్లి ఆపేసిన వరుడి కుటుంబం, యువ డాక్టర్ ఆత్మహత్య

కేరళలో ఒక యువ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది. వరకట్న డిమాండ్లను తీర్చలేదంటూ వరుడు పెళ్లికి నిరాకరించడంతో ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

కారు ఇవ్వలేదని పెళ్లి ఆపేసిన వరుడి కుటుంబం, యువ డాక్టర్ ఆత్మహత్య
X

కేరళలో ఒక యువ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది. వరకట్న డిమాండ్లను తీర్చలేదంటూ వరుడు పెళ్లికి నిరాకరించడంతో ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. తిరువనంతపురం మెడికల్ కాలేజీలో సర్జరీ విభాగంలో పీజీ చదువుతున్న సహానా , మెడికల్ పీజీ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధిగా ఉన్న రువైస్ అనే వ్యక్తితో కొంతకాలంగా ప్రేమలో ఉంది. ఇరుకుటుంబాల పెద్దల సమక్షంలో వీరు వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. అయితే, అబ్బాయి కుటుంబం బంగారం, భూమి, బీఎమ్‌డబ్ల్యూ కారు రూపంలో భారీ కట్నాన్ని డిమాండ్‌ చేశారు.

గల్ఫ్‌లో ఉద్యోగం చేసే సహానా తండ్రి రెండేళ్ల క్రితం చనిపోయారు. సరైన ఆదాయం లేదని తాము అంత కట్నం ఇచ్చుకోలేమని సహానా కుటుంబం వరుడి కుటుంబానికి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. అయితే కారు ఇవ్వలేని పక్షం లో ఈ పెళ్ళి జరగదని వరుడి కుటుంబం సంబంధాన్ని క్యాన్సిల్‌ చేసుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన సహానా తను చదువుతున్న ఇన్‌స్టిట్యూట్‌ సమీపంలోని అద్దె అపార్ట్‌మెంట్‌లో మంగళవారం ఉదయం బలవన్మరణానికి పాల్పడింది.

మెడికల్ కాలేజీ పోలీసులు ఇది అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. మరోవైపు సహానా మృతి వార్త తెలుసుకున్న రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించారు. పీజీ వైద్యురాలి ఆత్మహత్యపై సరైన విచారణ జరిపి నివేదికను సమర్పించాల్సిందిగా.. మహిళా శిశు సంక్షేమ శాఖను ఆదేశించారు. షహానా నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్‌లో ‘అందరికీ డబ్బు కావాలి’ అని షహానా రాసినట్లుగా సూసైడ్ నోట్ దొరికినట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో మెడికల్‌ పీజీ డాక్టర్స్‌ అసోసియేషన్‌ తమ సంస్థలోని అన్ని బాధ్యతల నుంచి వరకట్న డిమాండ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న రువైస్ ను తొలగించింది. మరోవైపు బాధిత కుటుంబాన్ని కేరళ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ అడ్వకేట్‌ సతీదేవి పరామర్శించారు. కట్నం డిమాండ్‌ చేసిన వారిపై వరకట్న నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

First Published:  7 Dec 2023 3:39 PM IST
Next Story