Telugu Global
CRIME

నన్ను ప్రేమించి.. మరో వ్యక్తితో పెళ్లా..? బెంగళూరులో కాకినాడ యువతి హత్య

ఇంట్లో వేరే సంబంధాలు చూడటం మొదలుపెట్టడంతో లీల కొద్ది రోజులుగా దివాకర్ ను దూరం పెడుతూ వచ్చింది. ఇటీవల లీలకు వేరే వ్యక్తితో పెళ్లి కూడా నిశ్చయం అయింది.

నన్ను ప్రేమించి.. మరో వ్యక్తితో పెళ్లా..? బెంగళూరులో కాకినాడ యువతి హత్య
X

ప్రేమ పేరుతో దగ్గరయ్యే యువకులు అమ్మాయిల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించడం, హత్యలు చేయడం ఇటీవల పరిపాటిగా మారింది. తనకు ఇక అమ్మాయి దక్కదు.. అని అనుమానం వస్తే చాలు చంపడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల హైదరాబాద్ లో తన ప్రేమకు అడ్డొస్తున్న యువకుడిని మరో యువకుడు దారుణంగా నరికి చంపాడు. ఇప్పుడు బెంగళూరులో మరో దారుణం జరిగింది. తనను ప్రేమించిన అమ్మాయి తనని కాదని వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధమవుతోందన్న కోపంతో అందరూ చూస్తుండగానే కత్తితో 16 సార్లు పొడిచి చంపాడు.

కాకినాడకు చెందిన లీలా పవిత్ర(28) బెంగళూరు నగరం దొమ్లూరులోని ఒక ల్యాబ్ లో పనిచేస్తోంది. ఆమెకు అక్కడే పని చేసే శ్రీకాకుళం జిల్లాకు చెందిన దివాకర్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారి ఐదేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల లీల తన ప్రేమ విషయాన్ని ఇంట్లో పెద్దల దృష్టికి తీసుకువచ్చింది. అయితే వారు ప్రేమ వివాహానికి అంగీకరించలేదు.

ఇంట్లో వేరే సంబంధాలు చూడటం మొదలుపెట్టడంతో లీల కొద్ది రోజులుగా దివాకర్ ను దూరం పెడుతూ వచ్చింది. ఇటీవల లీలకు వేరే వ్యక్తితో పెళ్లి కూడా నిశ్చయం అయింది. తనను కాదని లీల వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధం అవుతుండడం దివాకర్ కు నచ్చలేదు. ఆమెపై కోపం పెంచుకున్న అతడు లీలను చంపేయాలని నిర్ణయించుకున్నాడు.

మంగళవారం డ్యూటీకి వచ్చిన లీల పని ముగించుకొని రాత్రి 7.45 గంటలకు ఆఫీస్ బయటకు వచ్చింది. అయితే పథకం ప్రకారం బయట ఎదురుచూస్తున్న దివాకర్ సహచర ఉద్యోగులు చూస్తుండగానే లీలపై కత్తితో పలుమార్లు పొడిచాడు. సమాచారం అందుకొని అక్కడికి చేరుకున్న పోలీసులు దివాకర్ ను అదుపులోకి తీసుకున్నారు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడ్డ లీలను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు వదిలినట్లు వైద్యులు నిర్ధారించారు. లీల శరీరంపై 16 కత్తిపోట్లు ఉన్నట్లు జీవన బీమానగర పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు వారు చెప్పారు.

First Published:  1 March 2023 1:30 PM IST
Next Story