కుంభమేళాకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ఎంపీకి తీవ్రగాయాలు
ఎన్‌హెచ్-75పై బుధవారం తెల్లవారుజామున ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన జేఎంఎం ఎంపీ మహువా మాజీ కారు

ప్రయాగ్‌రాజ్‌లో అత్యంత వైభవంగా మొదలైన మహాకుంభమేళా నేటితో ముగియనున్నది. ఈ నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో కుంభమేళాకు వచ్చారు. ఇక తాజాగా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించి తిరిగి వెళ్తుండగా జేఎంఎం రాజ్యసభ ఎంపీ మహువా ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎంపీకి గాయాలు కావడంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. జార్ఖండ్‌కు చెందిన ఎంపీ మహువా మాజీ కుంభమేళాకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తున్న సమయంలో జార్ఖండ్‌లోని లతేహర్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. హాట్‌వాగ్ గ్రామ సమీపంలోని ఎన్‌హెచ్-75పై బుధవారం తెల్లవారుజామున ఆగి ఉన్న ట్రక్కును ఆమె కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎంపీ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వెంటనే ఆమెను రాంచీలోని రిమ్స్‌కు తరలించారు. కారు ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎంపీ కుమారుడు, కోడలు కూడా ఉన్నారు. ఈ ప్రమాద ఘటనపై ఎంపీ కుమారుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం చికిత్స జరుగుతున్నది. ఉదయం 3.45 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆమె ఎడమ చేతికి బలమైన గాయమైనట్లు డాక్టర్లు తెలిపారు. ఆమెకు సర్జరీ చేయనున్నారు. ప్రస్తుతం మహువా మాజీ ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు.