చేపల సాగు పేరుతో కోట్లలో అక్రమ రుణాలు.. - నలుగురు నిందితుల పట్టివేత.. రూ.20.31 కోట్ల ఆస్తుల జప్తు
నిందితులు నలుగురూ తమ కుటుంబసభ్యులను, తమ వద్ద పనిచేసే సిబ్బందిని చేపల సాగు చేసే రైతులుగా చూపించి కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా ఈ రుణాలు పొందారు.
చేపల సాగు పేరిట అక్రమంగా రుణాలు తీసుకున్న నిందితుల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం జప్తు చేసింది. నిందితులు గుంటూరు జిల్లాకు చెందిన మాద సుబ్రహ్మణ్యం, మాద శ్రీనివాసరావు, గండూరి మల్లికార్జునరావు, ఏలూరి ప్రసాదరావు. వీరిపై 2002లోనే సీబీఐ కేసు నమోదు చేసింది. ఐడీబీఐ బ్యాంకును మోసం చేసి వీరు రుణాలు పొందినట్టు కేసులో పేర్కొంది.
247 మంది పేరుతో రూ.57.10 కోట్ల రుణాలు
నిందితులు నలుగురూ తమ కుటుంబసభ్యులను, తమ వద్ద పనిచేసే సిబ్బందిని చేపల సాగు చేసే రైతులుగా చూపించి కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా ఈ రుణాలు పొందారు. మొత్తం 247 మంది పేరుతో రూ.57.10 కోట్ల మేరకు రుణాలు పొందినట్టు తేలింది. అప్పటి ఐడీబీఐ గుంటూరు శాఖ మేనేజరు చెన్నప్పగారి శంకర్ హరీష్ వీరికి సహకరించినట్టు సీబీఐ నిర్ధారించింది.
రుణం డబ్బుతో ఆస్తుల కొనుగోలు..
అక్రమంగా తీసుకున్న రుణంతో నిందితులు నలుగురూ పలు ప్రాంతాల్లో స్థిరాస్తులు కొనుగోలు చేసినట్టు ఈడీ గుర్తించింది. నిందితులు మనీ ల్యాండరింగ్ చట్టాలను కూడా ఉల్లంఘించినట్టు ఈడీ నిర్ధారించింది. నిందితులకు చెందిన 47 స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. వాటి విలువ రూ.20.31 కోట్లు ఉంటుందని తెలిపింది.