భార్యలపై కత్తులతో దాడి.. - తెనాలి, అనంతపురంలో వరుస ఘటనలు
తెనాలి నాజరుపేటకు చెందిన వెంకట కోటయ్య సొంత లారీ నడుపుతూ, అతని భార్య స్వాతి (35) పట్టణంలోని గాంధీనగర్‌లో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తూ జీవిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
అనుమానమే పెనుభూతమైంది.. కట్టుకున్న భార్యను కడతేర్చాలనుకునేంతగా అది పెరిగింది.. క్షణికావేశంలో కత్తులు పట్టుకుని స్వైరవిహారం చేశారు ఆ భర్తలు.. తమ భార్యల కుత్తుకలు కోసేసి.. జీవితాన్ని అంధకారంలోకి నెట్టేసుకున్నారు.. తమతో పాటు తమ బిడ్డల జీవితాన్నీ అంధకారంలోకి తోసేశారు. ఈ రెండు దారుణాలూ ఒకటి తెనాలిలో, మరొకటి అనంతపురంలో జరిగాయి. గురువారం ఒకేరోజు ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.
తెనాలి నాజరుపేటకు చెందిన వెంకట కోటయ్య సొంత లారీ నడుపుతూ, అతని భార్య స్వాతి (35) పట్టణంలోని గాంధీనగర్‌లో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తూ జీవిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. ఈ విషయమై ఆమెతో గొడవలు పడుతున్నాడు. అనుమానం పెనుభూతమై.. ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. గురువారం కత్తి, పూలదండలు తీసుకుని బైక్‌పై భార్య బ్యూటీపార్లర్‌కు వెళ్లాడు. అప్పటికే అక్కడ ఇద్దరు మహిళలు ఉండటంతో వారు వెళ్లేవరకు వేచివున్నాడు. అనంతరం తలుపు మూసి భార్యతో వాగ్వాదానికి దిగాడు. ఆపై కత్తితో ఆమెను విచక్షణారహితంగా పొడిచి హతమార్చాడు. తన వెంట తెచ్చుకున్న పూలదండలను నివాళిగా ఆమెపై వేసి నేరుగా ఇంటికి వెళ్లాడు. బైక్ అక్కడ ఉంచి, కత్తి ఇంట్లో పెట్టి, పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. జూదం, మద్యానికి బానిసైన స్వాతి భర్త.. ఇటీవల ఆమె పేరిట ఉన్న స్థలాన్ని అమ్మాలని వేధిస్తున్నాడని, అందుకు ఆమె అంగీకరించలేదనే హతమార్చాడని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు.
అనంతపురంలో జరిగిన మరో ఘటనలో బాధితురాలు సుమంగళి, కామర్స్ అధ్యాపకురాలు. గత 20 ఏళ్లుగా పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని ఎయిడెడ్ కాలేజీలో ఆమె కామర్స్ అధ్యాపకురాలిగా విధులు నిర్వర్తించారు. భర్త పరేష్, ఆమె కలసి అక్కడే నివసించేవారు. వీరికి సంతానం లేరు. ఇటీవల చెడు వ్యసనాలకు బానిసైన పరేష్ డబ్బు కోసం తరచూ ఆమెను వేధించేవాడు. గతేడాది అక్టోబర్‌లో అనంతపురం ఆర్ట్స్ కళాశాలకు బదిలీ అయ్యారు. భర్త పరేష్‌కి, ఆమెకు మధ్య గత కొన్నేళ్లుగా విభేదాలు ఉండటంతో.. ఏడాదిన్నరగా వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. సుమంగళి శ్రీనివాస నగర్‌లో, పరేష్ నవోదయ కాలనీలో నివసిస్తున్నారు. విడాకులు కోరుతూ సుమంగళి దరఖాస్తు చేయగా, కోర్టులో కేసు నడుస్తోంది.
కళాశాలకే వెళ్లి మరీ..
ఈ నేపథ్యంలో ఆమె ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న పరేష్.. చివరికి ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. గురువారం తన భార్య సుమంగళి పనిచేస్తున్న కళాశాలకే వెళ్లి.. ఆమె స్టాఫ్ రూంకి వెళ్తుండగా వెనుక నుంచి కత్తితో దాడి చేశాడు. ఆపై ఆమెను పీక కోసి గాయపరిచాడు. అనంతరం కత్తితో కళాశాల ఆవరణలోనే తచ్చాడాడు. ఈ ఘటనతో కళాశాలలో భీతావహ పరిస్థితి ఏర్పడింది. సిబ్బంది, విద్యార్థులు భయంతో వణికిపోయారు. ఈలోగా సిబ్బంది ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన సుమంగళిని ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.