Telugu Global
CRIME

క్రికెట్ బెట్టింగ్స్‌లో రూ.100 కోట్లు పోగొట్టాడు.. తిరిగి రాబట్టుకోవడానికి సబ్-బుకీగా మారాడు!

ఐపీఎల్ బెట్టింగులకు పాల్పడుతున్న ముఠా అరెస్టుకు సంబంధించిన వివరాలను శనివారం రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ వెల్లడించారు.

క్రికెట్ బెట్టింగ్స్‌లో రూ.100 కోట్లు పోగొట్టాడు.. తిరిగి రాబట్టుకోవడానికి సబ్-బుకీగా మారాడు!
X

అతను ఒక మాజీ ఆర్డీవో కొడుకు.. మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి వెళ్తాడని తల్లిదండ్రులు ఆశిస్తే.. క్రికెట్ బెట్టింగులకు అలవాటు పడ్డాడు. 12 ఏళ్లలో రూ.100 కోట్లను పోగొట్టాడు. తీవ్రమైన అప్పుల పాలైనా సరే అతను బెట్టింగులు మానలేదు. ఎక్కడ పోగొట్టుకున్నామో.. అక్కడే సంపాదించుకోవాలని అనుకున్నాడేమో.. ఈ సారి బుకీ అవతారం ఎత్తాడు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన సన్‌రైజర్స్ వర్సెస్ నైట్ రైడర్స్ మ్యాచ్‌కు సంబంధించిన బెట్టింగులకు పాల్పడుతుండగా.. రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ బెట్టింగులకు పాల్పడుతున్న ముఠా అరెస్టుకు సంబంధించిన వివరాలను శనివారం రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ వెల్లడించారు. బెట్టింగ్స్‌కు పాల్పడుతున్న సబ్-బుకీస్ ఈ. జగదీశ్, జే. అశోక్ రెడ్డి, కలెక్షన్ ఏజెంట్ వి. చరణ్‌లను అరెస్టు చేసినట్లు చెప్పారు. అయితే ఈ కేసులో బుకీలుగా వ్యవహరిస్తున్న ప్రధాన నిందితులు విపుల్ మోంగా (హర్యానా), ఎం. సురేశ్ (ఏపీ), పి. శ్రీనివాస్‌రావు (ఏపీ)లను ఇంకా అరెస్టు చేయాల్సి ఉందని చెప్పారు.

జగదీశ్, అశోక్ రెడ్డి, వి. చరణ్ ముఠాగా ఏర్పడి చాలా పకడ్బంధీగా బెట్టింగ్స్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల ద్వారా ఈ ముఠా రూ.3 కోట్ల మేర వెనకేసినట్లు స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి కమిషనరేట్ పరిధిలోని వాసవి కాలనీలో బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం అందుకొని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. వీళ్లు పంటర్ల నుంచి యాప్ ద్వారా బెట్టింగ్స్ స్వీకరిస్తున్నట్లు చెప్పారు.

కాగా, అశోక్ రెడ్డి అనే వ్యక్తి గత 12 ఏళ్లుగా బెట్టింగ్‌లకు బానిస అయ్యాడని.. వీటి ద్వారా రూ.100 కోట్ల వరకు పోగొట్టుకున్నట్లు సీపీ తెలిపారు. అశోక్ తండ్రి ఏపీలో ఆర్డీవోగా పని చేసి రిటైర్ అయినట్లు పేర్కొన్నారు. అయితే, పోయిన డబ్బు తిరిగి రాబట్టుకోవడానికి కొన్నాళ్లుగా సబ్-బుకీగా మారాడు. ఇప్పటికీ రూ.10 కోట్ల మేర అతడికి అప్పులు ఉన్నట్లు చెప్పారు. ఎప్పటికైనా బుకీగా మారాలనే ఆలోచనతోనే విపుల్‌తో కలిసి పని చేస్తున్నాడని చౌహాన్ వెల్లడించారు. ఇక జగదీశ్ మిర్యాలగూడకు చెందిన వ్యక్తి అని.. కొన్నాళ్లుగా బెట్టింగ్‌లకు అడిక్ట్ అయినట్లు చెప్పారు.

ఈ ముగ్గురి సభ్యుల ముఠా నేషనల్ ఎక్ఛేంజ్ యాప్ ద్వారా పకడ్బంధీగా బెట్టింగ్స్ నిర్వహిస్తున్నారు. యూజర్ల కోసం ఐడీ, పాస్‌వర్డ్ క్రియేట్ చేసి ఎలాంటి అనుమానం రాకుండా వ్యవహరిస్తున్నారు. సులభంగా డబ్బు సంపాదించడానికే బెట్టింగ్స్‌ను ఎంచుకున్నామని నిందితులు చెప్పినట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు.

First Published:  16 April 2023 7:07 AM IST
Next Story