Telugu Global
CRIME

50 మంది బాలికలపై లైంగిక వేధింపులు.. ప్రిన్సిపల్ అరెస్ట్

సెప్టెంబర్ 14న విద్యార్థినుల నుంచి ప్రిన్సిపల్‌పై రాతపూర్వకంగా 60 ఫిర్యాదులు అందాయని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేణు భాటియా తెలిపారు.

50 మంది బాలికలపై లైంగిక వేధింపులు.. ప్రిన్సిపల్ అరెస్ట్
X

50 మంది బాలికలపై లైంగిక వేధింపులు.. ప్రిన్సిపల్ అరెస్ట్

50 మంది బాలికలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో హర్యానాలోని జింద్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ పోలీసులకు అల్టిమేటం జారీ చేసిన తర్వాతే ఈ అరెస్టు జరిగింది. ఫిర్యాదుల పట్ల పోలీసుల అలసత్వంపై మహిళా కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. పాఠశాలలోని కొంతమంది విద్యార్థినుల ఫిర్యాదులను తాము సెప్టెంబర్ 14న పోలీసులకు పంపామని, పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణంగా నిందితులు తప్పించుకునేందుకు సమయం దొరికిందని ఆరోపించింది. దీనిపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కూడా ఏర్పాటు చేశారు.

సెప్టెంబర్ 14న విద్యార్థినుల నుంచి ప్రిన్సిపల్‌పై రాతపూర్వకంగా 60 ఫిర్యాదులు అందాయని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేణు భాటియా తెలిపారు. వాటిలో 50 ఫిర్యాదులు నిందితుడి చేతిలో శారీరక వేధింపులకు గురైన బాలికలవేనని, మిగతా 10 మంది బాలికలు ప్రిన్సిపల్ ఇలాంటి పనులు చేసేవాడని తమకు తెలుసని తమ ఫిర్యాదులో పేర్కొన్నారని చెప్పారు. అయితే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన వెంటనే నిందితుడిని అరెస్టు చేయకపోవడంతోనే అతను తప్పించుకోవడానికి సమయం దొరికిందంటూ మ‌హిళా క‌మిష‌న్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై ప్రభుత్వం ప్రిన్సిపల్‌ను వెనువెంటనే సస్పెండ్‌ చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు జింద్ పోలీసులు ప్ర‌త్యేక‌ బృందాలను ఏర్పాటు చేసి అతడిని ఎట్ట‌కేల‌కు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి మద్దతిచ్చిన మహిళా ఉపాధ్యాయురాలి పాత్రపై కూడా విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. బాలిక‌ల‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన ప్రిన్సిపల్‌పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌లు 354-A (లైంగిక వేధింపులు), 341, 342 (తప్పుగా నిర్బంధించడం), లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించడం (POCSO) చట్టాల కింద కేసు నమోదు చేశారు.

First Published:  6 Nov 2023 3:00 AM GMT
Next Story