చైల్డ్ పోర్న్ : గవర్నమెంట్, ఐటీ ఉద్యోగులే ఎక్కువగా చూస్తున్నారు!
చైల్డ్ పోర్న్‌ను చూసినా, డౌన్‌లోడ్ చేసినా, సర్క్యులేట్ చేసినా కనీసం 5 ఏళ్ల శిక్ష పడుతుందని సీఐడీ ఏడీజీపీ మహేశ్ భగవత్ తెలిపారు.
తెలంగాణలో చైల్డ్ పోర్న్‌ను చూసే వారిలో ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఎంప్లాయిస్ ఉన్నట్లు సీఐడీ అధికారులు చెబుతున్నారు. వీరితో పాటు విద్యార్థులు కూడా చైల్డ్ పోర్నోగ్రఫీకి అలవాటు పడ్డారని ఇటీవల చేసిన ఒక అధ్యయనంలో తేలింది. సీఐడీ ఏడీజీపీ మహేశ్ భగవత్ చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులకు సంబంధించి సమీక్ష నిర్వహించగా పలు విషయాలు వెల్లడయ్యాయి. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను సర్క్యులేట్ చేస్తున్నట్లు గుర్తించారు.
గత రెండేళ్లలో 44 కేసులు చైల్డ్ పోర్న్‌కు సంబంధించి రిజిస్టర్ అయ్యాయని.. సమీక్ష చేసిన తర్వాత కొత్తగా 13 కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 34 కేసుల్లో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోందని.. 8 కేసుల్లో ఇప్పటికే చార్జిషీటు దాఖలు చేసి.. ట్రయల్‌కు పంపించినట్లు చెప్పారు. చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ (సీఎస్ఏఎం) కేసుల్లో లోతైన ఇన్వెస్టిగేషన్ చేయాలని.. దీన్ని ప్రాధాన్యతగా తీసుకోవడమే కాకుండా.. నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చేయాలని మహేశ్ భగవత్ అధికారులను ఆదేశించారు.
ఐటీ యాక్ట్ 2000 ప్రకారం చైల్డ్ పోర్న్ చూడటం, డౌన్‌లోడ్ చేయడం, సర్క్యులేట్ చేయడం తీవ్రమైన నేరం. ఇలా చేసే వారిపై నిత్యం నిఘా ఉంటుందని.. సోషల్ మీడియాలో, ఇతర మాధ్యమాల ద్వారా చూసినా, సర్క్యులేట్ చేసినా వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు వెల్లడించారు. కాగా, ఈ చైల్డ్ పోర్న్‌లో బాధిత చిన్నారులు మన దేశానికి చెందిన వారు కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇండియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ చైల్డ్ పోర్న్‌లోని బాధితులు అందరూ విదేశాలకు చెందిన వారే అని తెలిపారు.
చైల్డ్ పోర్న్ కేసులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సీఐడీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ఈ రకమైన పోర్న్‌ను చూసే వారి వివరాలను నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా గుర్తిస్తున్నారు. దీంతో పాటు అమెరికాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిడ్ చిల్డ్రెన్ ద్వారా కూడా లీడ్స్ అందుతున్నట్లు అధికారులు చెప్పారు. తెలంగాణలో సర్క్యులేట్ అవుతున్న చైల్డ్ పోర్న్ అంతా విదేశాల్లో తయారైనదే అని అధికారులు అంటున్నారు.
కాగా, చైల్డ్ పోర్న్‌ను చూసినా, డౌన్‌లోడ్ చేసినా, సర్క్యులేట్ చేసినా కనీసం 5 ఏళ్ల శిక్ష పడుతుందని సీఐడీ ఏడీజీపీ మహేశ్ భగవత్ తెలిపారు. అంతే కాకుండా పదే పదే ఇలాంటి నేరాలకు పాల్పడితే వారిపై పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తామని అధికారులు స్పష్టం చేశారు.