Telugu Global
CRIME

మంత్రి దయాకర్ రావు సంతకం ఫోర్జరీ.. నిందితుల కోసం గాలింపు

బంజారాహిల్స్ పోలీసులు నిందితులపై ఐపీసీ 419, 420, 464, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మంత్రి దయాకర్ రావు సంతకం ఫోర్జరీ.. నిందితుల కోసం గాలింపు
X

రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతకాన్ని ఫోర్జరీ చేసి డబుల్ బెడ్రూల్ ఇళ్లు, ఇతర పథకాల డబ్బులు కొట్టేయడానికి ఇద్దరు ప్రయత్నించారు. ఈ విషయాన్ని గుర్తించిన మంత్రి ఓఎస్డీ.. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం నర్రెగూడెంకు చెందిన మహ్మద్ గౌస్ పాషా అనే వ్యక్తి మొబైల్స్ వ్యాపారం చేస్తున్నాడు. ఇదే జిల్లాకు చెందిన గుంటి శేఖర్ అనే వ్యక్తి ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. వీరిద్దరూ కలిసి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా లబ్ధిపొందాలని భావించారు. ఇందుకోసం ఒక స్కెచ్ వేశారు. మంత్రి దయాకర్ రావు లెటర్ హెడ్ తయారు చేసి.. దానిపై వీరిని రికమెంట్ చేస్తున్నట్లు రాసుకొని.. మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి పథకాల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు.

ఇటీవల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం పెట్టుకున్న అప్లికేషన్లను రెవెన్యూ సిబ్బంది వెరిఫై చేస్తుండగా.. వీరిద్దరి అప్లికేషన్లలో మంత్రి లెటర్ హెడ్ మీద రికమెండేషన్ చేసినట్లు కనిపించింది. ఆ లెటర్‌పై అనుమానం వచ్చిన రెవెన్యూ సిబ్బంది.. వెంటనే మంత్రి ఓఎస్డీ దృష్టికి తీసుకొని వెళ్లారు. దానిని పరిశీలించిన ఓఎస్డీ.. అది ఫోర్జరీ సంతకంగా.. లెటర్ హెడ్ కూడా నకిలీదిగా తేల్చారు. వెంటనే ఓఎస్డీ రాజేశ్వర్ రావు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

బంజారాహిల్స్ పోలీసులు నిందితులపై ఐపీసీ 419, 420, 464, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ప్రస్తుతం ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిసింది. వీరిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.

First Published:  21 Aug 2023 12:38 PM IST
Next Story