గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతు
తాళ్లపూడి మండలం తాడిపూడి మహాశిరాత్రి సందర్భంగా విషాదం

తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో విషాదం చోటుచేసుకున్నది. మహాశివరాత్రి సందర్భంగా ఐదుగురు యువకులు గోదావరి స్నానానికి దిగి.. ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. లోతుగా ఉన్న ప్రదేశాన్ని గుర్తించకపోవడంతో నీటిలో మునిగిపోయారు. ఈక్రమంలో ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నంలో ఐదుగురు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారిలో ఒక యువకుడి మృతదేహం లభ్యమైంది. టి.పవన్, పి. దుర్గాప్రసాద్, ఎ. పవన్, జి. ఆకాశ్, పి. సాయికృష్ణ గల్లంతైన వారిలో ఉన్నారు. వీరంతా కొవ్వూరు, తాళ్లపూడి , రాజమహేంద్రవరంలో ఇంటర్, డిగ్రీ చదువుతున్నారు. యువకులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత, డీఎస్పీ దేవకుమార్ గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు.