బీహార్‌లో మళ్లీ పేలిన గన్.. కాల్పుల్లో ఐదుగురు మహిళల మృతి
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కాల్పులకు పాల్పడ్డ వారిలో ఒకరిని అరెస్టు చేశామని, ఇతర నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు వారు తెలిపారు.
బీహార్ లో మరోసారి తుపాకులు పేలాయి. ఐదుగురు మహిళల ప్రాణాలు బలిగొన్నాయి. భూవివాదం ఇందుకు కారణం అయ్యింది. ఒక వర్గానికి చెందిన వారు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో మరో వర్గానికి చెందిన ఐదుగురు మహిళలు చనిపోయారు. బీహార్ రాష్ట్రంలోని పశ్చిమ చంపారన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జిల్లాలోని నాకటి పటేర్వా గ్రామంలోని కొంత భూమిపై రెండు వర్గాల మధ్య కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి.
శనివారం కూడా మరొకసారి ఈ విషయమై వివాదాస్పద భూమి వద్ద ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో ఒక వర్గానికి చెందినవారు తుపాకులతో మరొక వర్గం వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు మహిళలు అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని గ్రామస్తులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కాల్పులకు పాల్పడ్డ వారిలో ఒకరిని అరెస్టు చేశామని, ఇతర నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు వారు తెలిపారు. బీహార్ లో కొన్నేళ్ల కిందట గన్ కల్చర్ విపరీతంగా ఉండేది. ప్రతి ఒక్కరి దగ్గర నాటు తుపాకులు ఉండేవి. ఇక రౌడీలు, రాజకీయ నాయకుల వద్ద అయితే ప్రైవేటు సైన్యం ఉండేది. అయితే ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాను రాను బీహార్ లో ఈ తరహా సంస్కృతి కనుమరుగైంది. ఇప్పుడు మరోసారి తుపాకుల కాల్పులు జరగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.