తల్లితో గడిపిన వారి ఇళ్లకు కూతురు నిప్పు- వీడిన మంటల మిస్టరీ
దాంతో యువతి తన తల్లి దగ్గరకు వచ్చిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని వారి ఇళ్లకు, గడ్డివాములకు నిప్పు పెట్టడం మొదలుపెట్టింది. తొలుత తన తల్లి నిద్రిస్తున్న సమయంలో తన ఇంటిలోనే నిప్పు పెట్టింది.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొత్తశానంబట్ల గ్రామంలో మంటల మిస్టరీని పోలీసులు చేధించారు. ఒక యువతి గ్రామంలోని ఇళ్లకు నిప్పుపెడుతున్నట్టు తేల్చారు. ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె చెప్పిన కారణంతో పోలీసులు అవాక్కయ్యారు. ఈ కేసును చేధించడానికి పోలీసులు చాలా శ్రమించాల్సి వచ్చింది.
నెల రోజుల వ్యవధిలో గ్రామంలోని 9 ఇళ్లు, 3 గడ్డివాములు కాలిపోయాయి. ఇలా ఎందుకు జరుగుతోందో అర్థం కాక గ్రామస్తులు భయపడిపోయారు. గ్రామంపై ఎవరో క్షుద్రపూజలు చేశారని నమ్మారు. జన విజ్ఞాన వేదిక సభ్యులు పర్యటించి అలాంటిది ఏమీ ఉండదని అవగాహన కల్పించేందుకు ప్రయత్నించారు. మంటలు ఎందుకొస్తున్నాయి అన్న దానిపై శాస్త్రీయ అధ్యయనం కోసం బృందాలు కూడా వచ్చాయి. కానీ మంటలకు కారణం కనిపెట్టలేకపోయారు. కొందరు భయంలో తాత్కాలికంగా ఊరు వదిలేసి వెళ్లిపోయారు.
గ్రామంలోని ఆకతాయిలను పోలీసులు గట్టిగా విచారించారు. అయినా క్లూ దొరకలేదు. దాంతో గ్రామంలో16 చోట్ల పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దాంతో ఇళ్లు తగలబెడుతున్నది ఒక యువతి అని తేలింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. ఇంటర్ ఫెయిల్ అయిన 19 ఏళ్ల యువతి ఇంటి దగ్గరే ఉంటోంది. అయితే ఆమె తన తల్లి ప్రవర్తనతో విసిగిపోయింది. ఇంటికి ఎవరెవరో రావడం, వారితో తన తల్లి సన్నిహితంగా ఉండడం చూసి ఆ యువతి తట్టుకోలేకపోయింది. తీరు మార్చుకోవాలని చెప్పినా తల్లి వినలేదు. మరో ఊరికి వెళ్లిపోదాం అని చెప్పినా పట్టించుకోలేదు.
దాంతో యువతి తన తల్లి దగ్గరకు వచ్చిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని వారి ఇళ్లకు, గడ్డివాములకు నిప్పు పెట్టడం మొదలుపెట్టింది. తొలుత తన తల్లి నిద్రిస్తున్న సమయంలో తన ఇంటిలోనే నిప్పు పెట్టింది. ఇలా చేయడం వల్ల భయంతోనైనా గ్రామాన్ని వదిలేసి మరో ఊరికి తన తల్లి వస్తుందని యువతి భావించింది. తన ఇంటిలో కాలిపోయిందని చెప్పిన 32 వేల రూపాయలు కూడా యువతి దగ్గర దొరికింది.