పరువు తీస్తోందని తండ్రి చంపేశాడు.. తాత పట్టించాడు
ఈనెల 10న గొంతు నులిమి కూతురిని చంపేశాడు. అనంతరం తన సన్నిహితుల సాయంతో మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి నంద్యాల- గిద్దలూరు మధ్య ఉన్న అడవుల్లో పడేశాడు.
నంద్యాల జిల్లా పాణ్యంలో కన్నకూతురిని దారుణంగా చంపేశాడో తండ్రి. కాపురానికి వెళ్లకుండా పరువు తీస్తోందన్న కోపంతో హత్య చేశాడు. అనంతరం అడవుల్లోకి తీసుకెళ్లి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. వివరాల్లోకి వెళితే..
పాణ్యం మండలం ఆలమూరు గ్రామానికి చెందిన దేవేందర్‌రెడ్డికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె 21 ఏళ్ల ప్రసన్నకు రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లోని ఒక సాప్ట్‌వేర్ ఇంజనీర్‌తో వివాహం జరిగింది. ఇటీవల భర్తతో గొడవపడి పుట్టింటికి వచ్చేసింది. తిరిగి వెళ్లాల్సిందిగా తండ్రితో పాటు పెద్ద మనుషులు సూచించినా ప్రసన్న వినలేదు. ఆమె తిరిగి భర్త వద్దకు వెళ్లకపోవడానికి కారణం అంతకు ముందే ఉన్న ప్రేమ వ్యవహారమని పోలీసులు గుర్తించారు.
పెళ్లికి ముందే ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్న ప్రసన్న అతడి కోసం తిరిగి గ్రామానికి వచ్చేసినట్టు తేల్చారు. కూతురు భర్త దగ్గరకు వెళ్లకపోవడం, గ్రామంలో పరువుపోతుండడంతో ఆగ్రహించిన దేవేందర్‌రెడ్డి ఈనెల 10న గొంతు నులిమి కూతురిని చంపేశాడు. అనంతరం తన సన్నిహితుల సాయంతో మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి నంద్యాల- గిద్దలూరు మధ్య ఉన్న అడవుల్లో పడేశాడు. మృతదేహాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా తల, మొండం వేరు చేసి వేర్వేరు చోట్ల పడేశాడు.
అనంతరం ఇంటికి వచ్చి ఏమీ తెలియనట్టుగా ఉన్నాడు. దేవేందర్ ఇటీవలే రెండో వివాహం చేసుకున్నాడు. హత్యకు గురైన ప్రసన్న మొదటి భార్య సంతానం. ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మొదటి భార్య చనిపోయింది. కుమార్తెలను దేవేందర్ రెడ్డే పెంచిపెద్ద చేశాడు. తరచూ ఫోన్ చేసే తన మనవరాలు ఇటీవల ఫోన్ చేయకపోవడంతో దేవేందర్ రెడ్డి మొదటి భార్య తండ్రి శివారెడ్డికి అనుమానం వచ్చింది.
ప్రనస్న ఏమైందని గట్టిగా నిలదీయగా దేవేందర్ రెడ్డి పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు. ఆఖరికి పరువు తీస్తోందని అందుకే చంపేశానని తన మామ శివారెడ్డికి వివరించాడు. దాంతో తాత శివారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు దేవేందర్‌రెడ్డిని విచారించగా జరిగినదాన్ని వివరించాడు. పెంచి పెద్దచేసి పెళ్లి చేశానని.. కానీ కాపురానికి వెళ్లకుండా, ప్రేమ పేరుతో పరువు తీస్తుండడంతో తాను ఆ పనిచేశానని అంగీకరించాడు. శివారెడ్డిని వెంటబెట్టుకుని వెళ్లిన పోలీసులు గురువారం అడవుల్లో గాలించినా మృతదేహం దొరకలేదు. శుక్రవారం మరోసారి వెళ్లి గాలించగా 300 అడుగుల లోయలో తల, మొండం కనిపించాయి. దేవేందర్ రెడ్డికి సహకరించిన ఇతర నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.